శివమంత్రం జపిస్తున్న రాహుల్…

Posted November 14, 2017 at 11:55 
తెలుగు సినిమా దర్శకులను, హీరోలను కొత్త కధలు చేయడం లేదు ఎందుకని అడిగితే ఓ స్టాక్ సమాధానం వస్తుంటుంది. ప్రపంచంలో వుందే ఐదారు కధలు, వాటినే అటూఇటూ మార్చి తీస్తుంటామని చెబుతుంటారు. అలాగే రాజకీయాలు కూడా తయారు అయ్యాయి. నాగరికత అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో మతం పేరుతో మారణహోమం జరిగింది. హిందూ మతంలో కూడా శైవులు, వైష్ణవుల మధ్య జరిగిన గొడవలు తమిళనాడు చరిత్ర చదివినవాళ్లకు బాగా తెలుసు. ఈ తరం వాళ్లకు మాత్రం కమల్ హాసన్ తీసిన దశావతారం సినిమా ద్వారా ఆ విషయాలు తెలుసు. కాలం మారింది. కానీ ప్రజల్లో ఆ భావోద్వేగాలు మాత్రం అలాగే వున్నాయి. అందుకేనేమో బీజేపీ రామ మంత్రం జపిస్తుంటే కాంగ్రెస్ యువనేత రాహుల్ శివశివ శంభో అంటున్నాడు.

rahul gandhi says i am lord shiva devotee

రెండు స్థానాలున్న బీజేపీ ఈ స్థాయికి రావడానికి అయోధ్య రామమందిర అంశం ఎంతగా ఉపయోగపడిందో తెలుసు. అలాగే 100 ఏళ్లకు పైగా చరిత్ర వున్న కాంగ్రెస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా దెబ్బ తినడానికి మెజారిటీ అభిప్రాయాలకన్నా మైనారిటీ మంత్రాన్ని ఎక్కువగా జపించడం కూడా ఓ కారణం. అయితే చిత్రం ఏమిటంటే పార్టీ కి బలం ఇచ్చిన రామ మందిర అంశాన్ని బీజేపీ ఇప్పుడు పెద్దగా తెర మీదకు తేవడం లేదు. కాంగ్రెస్ మాత్రం తమకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోడానికి కొత్తగా మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవించే పనిలో పడింది. ఎన్నికల వాతావరణంతో వేడెక్కిన గుజరాత్ లో రాహుల్ సరికొత్త పల్లవి అందుకున్నారు. బీజేపీ వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా తాను శివభక్తుడిని అని మోడీ సొంతగడ్డ గుజరాత్ లో వెలుగెత్తి చెబుతున్నారు. అంతే కాదు గుజరాత్ ఎన్నికల ప్రచారం కి వెళ్లిన ఆయన దేవాలయాలకు బాగా తిరుగుతున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్ కి మాత్రం దేశ రాజకీయాలకు కూడా కొత్తగా అనిపిస్తోంది. ఇప్పటిదాకా రాజకీయ మొద్దబ్బాయిగా పేరు పడ్డ రాహుల్ ని శివమంత్రమైనా గట్టెక్కిస్తుందేమో చూడాలి.

SHARE