ఎ.ఐ.సి.సి అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తన చమత్కారాన్ని చూపారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికార పార్టీ అయినా తెరాస పార్టీ పైన తీవ్ర విమర్శలు చేస్తూ, ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రజకూటమి తరపున ఎన్నికల బరిలో నిలబడ్డ అభ్యర్థులలో ఉత్సాహం నింపడానికి తెలంగాణలోని వివిధ నియోజకవర్గాలలో ప్రచార సభలు, రోడ్ షోలు, సమావేశాలు నిర్వహిస్తూ, కాంగ్రెస్ క్యాడర్ అభ్యర్థులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. తన ప్రచారంలో భాగంగా తెరాస పార్టీ ని విమర్శిస్తూ, తెరాస, ఎంఐఎం మరియు బీజేపీ పార్టీలు మూడు ఒక్కటేనని, ఈ మూడింటిలో ఏ పార్టీ కి ఓటేసినా అది ఆ మూడు పార్టీలకు చెందుతుందని, కేంద్రంలో నరేంద్ర మోడీ మరియు రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఒకే తీరుగా ఉందని, ప్రజలను తమ మాటల గారడీ తో మభ్యపెట్టి, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రజలను దోచుకోవడంలో ఒకరికి మరొకరు సాయం చేసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.
అంతేకాకుండా కేసీఆర్ పేరుకి మరో సరికొత్త నిర్వచనం ఇచ్చారు రాహుల్ గాంధీ. కేసీఆర్ అంటే ఖావో కమీషన్ రావు అని నిర్వచిస్తూ, ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పేరుతో కోట్లు దోచుకొని, తన కుటుంబానికి కట్టబెడుతున్నారని, 2014 లో తెలంగాణ రాష్ట్రము ఏర్పడినప్పుడు మిగులు శాతంలో ఉన్న తెలంగాణను ఇప్పుడు లక్షల కోట్ల అప్పుల్లో ఉంచాడని, ఆ దోచుకున్న సొమ్మంతా తన కుటుంబం కోసమే ఖర్చు చేశాడని, ప్రజలంతా ఈ విషయాన్నీ గమనించి ప్రజలు రానున్న ఎన్నికల్లో తెరాస పార్టీ ని మట్టికరిపించాల్సిందిగా ప్రజలను కోరారు. కేసీఆర్ తన ఎన్నికల్ల ప్రచారంలో ఒక విషయం మాత్రం సరిగ్గా చెప్పారని, కేసీఆర్ తాను ఓడిపోతే ఫౌం హౌస్ కి వెళ్తానన్న మాట నిజం చేస్తూ, కేసీఆర్ ని సాదరంగా ఫౌం హౌస్ కి పంపించాలని ప్రజలను కోరారు రాహుల్ గాంధీ. టిఆర్‌ఎస్ పార్టీ లో ఒక ‘ఎస్’ మిస్ అయ్యిందని, టిఆర్‌ఎస్ పార్టీ కి అసలు సిసలైన నిర్వచనం తెలంగాణ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని అన్నారు. రానున్న తెలంగాణ ఎన్నికల్లో తెరాస పార్టీ ని చిత్తుచిత్తుగా ఓడించి, తరువాత పీఎం నరేంద్ర మోడీ ని సాగనంపడమే తమ లక్ష్యమని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా చెప్పారు. రాహుల్ గాంధీ మళ్ళీ డిసెంబర్ 3 వ తేదీన తెలంగాణలోని ప్రచారానికి రానున్నారు.