Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్నికల వేళ ప్రత్యర్థులను ఇరుకున పెట్టడానికి వీలుండే ఏ అంశాన్నీ రాజకీయ పార్టీలు వదిలిపెట్టవు. ఇప్పుడిక సోషల్ మీడియా కూడా తోడవడంతో…నేతల పొరపాట్లు ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మారిపోతున్నాయి. సార్వత్రిక ఎన్నికల సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న కర్నాటకలో ఇప్పుడంతా ఇలాంటి ప్రచారమే సాగుతోంది. యడ్యూరప్ప ప్రభుత్వం అవినీతిమయం, ప్రధాని మోడీ దేశాన్ని నాశనం చేస్తారు అంటూ అమిత్ షా పొరపాటుగా మాట్లాడిన కొన్ని మాటలను కాంగ్రెస్ సోషల్ మీడియా పదే పదే ప్రచారం చేసిన తీరు ఇప్పటికే చూశాం. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వంతువచ్చింది. నిజానికి ప్రసంగాల్లో రాహుల్ అనేక పొరపాట్లు చేస్తుంటారు.
ఆయన పొరపాటుగా మాట్లాడిన మాటలు చాలాసార్లు నెట్ లో వైరల్ గా మారాయి కూడా. కానీ ఈ సారి కర్నాటక ఎన్నికల ప్రచారంలో మాత్రం ఆయన తన ప్రసంగాల్లో ఎక్కడా తప్పు దొర్లకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే కాంగ్రెస్ కు అధికారం నిలబెట్టడమే లక్ష్యంగా కర్నాటకలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రాహుల్…ఆచితూచి మాట్లాడుతున్నప్పటికీ…..అసం కల్పితంగా ఓ తప్పు చేసి మీడియాకు దొరికిపోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ శుక్రవారం బంత్వాల్ లో ఏర్పాటుచేసిన సభలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో పాటు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ ఇతర సీనియర్ నేతలు సభావేదికపై కూర్చుని ఉన్నారు.
సభ ప్రారంభం కాగానే గాయకులు దేశభక్తి గీతాలు ఆలపిస్తున్నారు. అందులో భాగంగా గాయకులు వందేమాతరం పాడుతుండగా….గేయాన్ని ఒక్క లైన్ లో ముగించాల్సిందిగా కర్నాటక కాంగ్రెస్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కు రాహుల్ సైగ చేశారు. ఆయన సూచన మేరకు గాయకులు కూడా వందేమాతరాన్ని అర్ధాంతరంగా ముగించారు. దీంతో అక్కడున్నవారంతా షాక్ తిన్నారు. దీనికి సంబంధించిన వీడియోను స్థానిక మీడియా ప్రసారం చేయడంతో..సోషల్ మీడియాలో అది వైరల్ గా మారింది. ఇప్పుడు బీజేపీ ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకుంది. వందేమాతర గీతానికి గౌరవం ఇవ్వని వ్యక్తి దేశ ప్రజలకు ఎలాంటి మర్యాద ఇవ్వలేరని బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై విరుచుకుపడుతున్నారు. సామన్యప్రజలే వీలైనప్పుడల్లా దేశభక్తి గీతాలు ఆలపిస్తుంటారని, కాంగ్రెస్ అధ్యక్షుడు ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.