రాహుల్ వల్లే కూటమి సీఎంగా రాజీనామా !

గతంలో కలిసి ప్రభుత్వాన్ని నడిపిన ఆర్జేడీ, జేడీయూల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటోంది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేసి అధికారంలోకి వచ్చిన కూటమి సీఎం నితీశ్ కుమార్ రాజీనామాతో ప్రభుత్వం పడిపోయింది. అయితే తన నిర్ణయానికి అసలు కారణాన్ని బిహార్ సీఎం నితీశ్ కుమార్ వెల్లడించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అసమర్ధత వల్లే తాను మహాకూటమి నుంచి బయటకు వచ్చానని తెలిపారు. బిహార్‌ లో అవినీతి పై ఆయనకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రాహుల్ వేచిచూసే ధోరణిని భరించలేక రాజీనామా చేశానని వివరించారు. ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు, అప్పటి బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మీద అవినీతి ఆరోపణలొచ్చాయని వాటి మీద త్వరగా నిర్ణయం తీసుకుని అవినీతిని ఉపేక్షించలేమని హెచ్చరించాలని రాహుల్‌ను కోరానని ఆయన అన్నారు. అయితే దీని పై రాహుల్ స్పందించలేదని, అవినీతి, నేరాలు, మతోన్మాదం వంటివి తను ఒప్పుకోనని కానీ ఆర్జేడీ నేతలకు ఇలాంటి పట్టింపులు లేవని, అందుకే బిహార్ ప్రజల క్షేమం కోసం ఆర్జేడీతో తెగదెంపులు చేసుకున్నా. బీజేపీ మద్దతుతో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశానని చెప్పుకొచ్చారు, తాను నిజాయితీగా తీసుకునే నిర్ణయాలకు ఆర్జేడీ నేతలు అడ్డుచెప్పేవారని అంతే కాక ఆ పార్టీ కార్యకర్తలు పోలీసులకు ఫోన్ చేసి పనులు చేయించుకోవడం తనకు ఇబ్బందిగా అనిపించిందని చెప్పుకొచ్చారు. కూటమిలో ఉన్న రాహుల్ గాంధీ తేజస్వీ అవినీతిపై స్పందించని కారణంగానే ఈ కీలక నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పుకొచ్చాడు. అయోధ్య, ఆర్టికల్ 370 లాంటి చాలా అంశాలలో విభేదాలున్నప్పటికీ బీజేపీతో కలిసి పని చేయాలనుకున్నానని 2019 లోక్‌సభ ఎన్నికల్లో, వచ్చే ఏడాది జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జేడీ(యూ)-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ఈ సందర్భంగా నితీశ్ కుమార్ ప్రకటించారు.