స్పీకర్ పోచారం…లాంచనమే !

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవికి సీనియర్ నేత పోచారం శ్రీనివాస రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. రాష్ట్రంలోనే సీనియర్ శాసనసభ్యుల్లో ఒకరిగా ఉన్న ఆయనకే పాలనా పరంగా విశేష అనుభవం ఉండంటంతో కేసీఆర్ ఆయన వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. ఈరోజు రాత్రికి అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. స్పీకర్ పదవికి పోచారంతో పాటు పద్మా దేవేందర్ రెడ్డి, ఈటెల రాజేందర్ పేర్లను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఇక స్పీకర్ ఎన్నికకు రేపు నామినేషన్ విడుదల చేయనున్నారు. అనంతరం ఎన్నిక ప్రక్రియ సాగుతుంది. జనవరి 18న స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. ప్రొటెం స్పీకర్‌ గా చార్మినార్ ఎమ్మెల్యే, మజ్లిస్ నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్ బుధవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో రేపు ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ సమావేశమవుతుంది. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ విడుదల చేస్తారు. కొత్త స్పీకర్ నేతృత్వంలో జనవరి 19న ఉదయం 11.30 గంటలకు మండలి సమావేశం ప్రారంభమవుతుంది. 19న ఉదయం ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. పోచారం శ్రీనివాస రెడ్డికి స్పీకర్‌ బాధ్యతలు ఇస్తే.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. మిషన్ భగీరథ అథారిటీ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించిన వేముల ప్రశాంత్ రెడ్డి ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇక 1994లో తొలిసారిగా బాన్సువాడ నుంచి టీడీపీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1998లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది భూగర్భ గనులు, జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. కొంత కాలం పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రిగానూ పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎమ్మెల్యే పదవిని త్యజించి టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన పోచారం.. ఉద్యమకాలంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొలి వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1976లో రాజకీయాల్లో అడుగు పెట్టిన పోచారం 1977లో దేశాయిపేట సింగిల్‌విండో ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1987లో డీసీసీబీ చైర్మన్‌గా పనిచేశారు.