ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్‌బాస్–3 షో విజేతగా గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ నిలిచారు. దీంతో ఆయన రూ.50 లక్షల నగదు బహుమతిని దక్కించుకున్నారు. అండర్‌డాగ్‌గా బిగ్‌హౌస్‌లోకి ఎంటర్ అయిన రాక్‌స్టార్ రాహుల్ విన్నర్‌గా కాలర్ ఎగరేశాడు. దీంతో టైటిల్ ఫెవెరెట్‌గా హౌస్‌లో సందడిచేసిన పటాకా శ్రీముఖి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రూ.50లక్షల నగదు బహుమతిని, బిగ్‌బాస్ ట్రోఫిని రాహుల్ అందుకున్నాడు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ తనకు ఓట్లు వేసి గెలిపించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పాదాభివందనాలు చేశారు. ఈ విజయం తనను పది మెట్లు పైకి ఎక్కించాయని, ఇక నుంచి తన లైఫ్ కొత్తగా ఉండబోతుందని చెప్పారు. తన గెలుపు కోసం తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రేక్షకులు ఎంతో సహకరించారని రాహుల్ అన్నారు. తన విజయంలో పునర్నవి, వరుణ్, వితికల కష్టం కూడా ఉందన్నారు.
కాగా, బిగ్‌బాస్ సీజన్ త్రీకి గ్రాండ్‌గా ఎండ్ కార్డ్ పడింది. ఫైనల్ పోటీని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన బుల్లితెర ప్రేక్షకులు సుమారు మూడు గంటల పాటు ఇంట్లో టీవీలకు అతుక్కుపోయారు. ఎంతో మంది వెండితెర తారలు, బుల్లితెర నటీనటులు తమ ఆటపాటలతో అలరించారు. సీరియల్ యాక్టర్స్, పలువరు సెలబ్రిటీలు, బిగ్‌బాస్ కంటిస్టెంట్లు ధూమ్‌ధామ్‌గా సందడి చేశారు. ప్రతిరోజు పండగే టీమ్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి హంగామా చేసింది. హీరోయిన్స్ అంజలి, కేథరిన్, నిషా అగర్వాల్ ఫర్మామెన్స్లతో గ్రాండ్ ఫినాలే స్టేజీ దద్దరిల్లింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.