నగరంలో ఆదివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలుచోట్ల వాతావరణం చల్లబడి.. ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షం పడుతోంది. ఎల్‌బీ నగర్, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్, మలక్‌పేట్, సంతోష్‌నగర్, అబిడ్స్, కోఠి, బంజారాహిల్స్, ఉప్పల్, ఘట్కేసర్, మోహిదీపట్నం, పంజాగుట్టలలో వర్షం కురుస్తోంది. కాగా, గత కొద్ది రోజులుగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరయిన జనాలు.. వర్షం పలకింపుతో వేసవితాపం నుంచి కాస్త ఉపశమనం పొందారు.
మరోవైపు రాగల 48 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవ కాశం ఉందని తెలిపింది. ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దీంతో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది.