ఐపీఎల్‌కు సిద్ధమవుతున్న రైనా

ఐపీఎల్‌కు సిద్ధమవుతున్న రైనా

భారత క్రికెట్‌ జట్టులో రీఎంట్రీపై వెటరన్‌ సురేశ్‌ రైనా ఏమైనా ఆశలు పెట్టుకుంటే వాటిని వదులుకోవాల్సిందేనని ఇటీవల విమర్శలు ఎక్కువయ్యాయి. టీమిండియాలో పునరాగమనం లక్ష్యంగా ఐపీఎల్‌కు సిద్ధమవుతున్న రైనా.. జాతీయ జట్టు తరఫున ఆడి రెండేళ్లు దాటేసింది. దాంతో జాతీయ జట్టులో చోటు అంత ఈజీ కాదని మాజీలు అంటున్నారు. 2018 జూలైలో భారత్‌ తరఫున చివరిసారి కనిపించిన రైనా.. టీ20 వరల్డ్‌కప్‌ ధ్యేయంగా ప్రాక్టీస్‌కు సానబెడుతున్నాడు.

తాను రెండు టీ20 వరల్డ్‌కప్‌లు ఆడతానని ఇటీవల ప్రకటించిన రైనా.. అందుకు ఐపీఎల్‌ను సన్నాహకంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. దానిలో భాగంగానే అప్పుడే ఐపీఎల్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టేశాడు రైనా. దీనికి సంబంధించిన వీడియోను రైనా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ‘నేను ప్రేమిస్తున్న పనిని ఎక్కువగా చేస్తుంటాను. మిక్కిలి ఎక్కువ ప్రాక్టీస్‌ చేసి ప్రిపేర్‌గా ఉంటా. మైదానంలో అడుగుపెట్టాలనే ఆతృతగా ఉన్నా. ఇక నిరీక్షించలేను’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు.

ఇప్పటివరకూ భారత్‌ తరఫున 226 వన్డేలు ఆడిన రైనా, 78 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఐపీఎల్‌లో 193 మ్యాచ్‌లు ఆడిన రైనా 5,368 పరుగులు చేశాడు. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో రైనా యావరేజ్‌ 33.34 ఉండగా, స్టైక్‌రేట్‌ 137.14 గా ఉంది. ఐపీఎల్‌ కెరీర్‌లో రైనా ఒక సెంచరీతో పాటు 38 హాఫ్‌ సెంచరీలు సాధించి ఒక మార్కును సంపాదించుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ వచ్చే నెల 19వ తేదీ నుంచి యూఏఈ వేదికగా జరుగనుంది. సీఎస్‌కే తరఫున ఆడుతున్న రైనా.. మరొకసారి టైటిల్‌ను జట్టుకు అందివ్వాలనే పట్టుదలతో ఉన్నాడు. గతేడాది ఫైనల్‌కు చేరిన సీఎస్‌కే.. ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా సరిపెట్టుకుంది.