రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు

రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్‌ సముద్రంలో 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు మన్నార్‌ గల్ఫ్‌ ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం బలహీన పడి అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ట్రోపో ఆవరణం ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.

గడచిన 24 గంటల్లో నెల్లూరులో 6 సెం.మీ, వెంకటగిరి, శ్రీకాళహస్తిలో 5, తొట్టంబేడులో 4, తడ, సూళ్లూరుపేట, గూడూరు, పలమనేరు, పెనగలూరులో 3 సెం.మీ వర్షపాతం నమోదైంది. తిరుమలలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. వారం రోజులుగా వర్ష ప్రభావంతో తిరుమల గిరుల్లో చలితీవ్రత అధికమైంది. ఆదివారం కురిసిన వర్షానికి రెండో ఘాట్‌ వద్ద కొండ చరియలు విరిగి పడ్డాయి. అధికారులు సకాలంలో వాటిని తొలగించారు.