తూర్పుగోదావరి జిల్లాతో పాటు రాష్ట్రంలోనే కీలకమైన రాజమహేంద్రవరం లోక్సభ నియోజకవర్గంపై అధికార టీడీపీలో చిక్కుముడి వీడింది. సుదీర్ఘ మంతనాల తర్వాత రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సీనియర్ నేత బొడ్డు భాస్కర రామారావు అంగీకరించారు. పెద్దాపురానికి చెందిన బొడ్డు భాస్కరరామారావు గత ఎన్నికలకు ముందుకు టీడీపీని వీడి ఫలితాల తర్వాత మళ్లీ తిరిగొచ్చేశారు. చినరాజప్ప గత 2014లో పెద్దాపురం నుంచి పోటీ గెలుపొందారు. నమ్మకస్తుడిగా పేరొందిన ఆయనకు చంద్రబాబు ఉపముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి పదవులను కట్టబెట్టారు. అయితే తాను వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం నుంచి పోటీ చేస్తానని బొడ్డు భాస్కర రామారావు ప్రచారం చేసుకోవడంతో చినరాజప్ప వర్గం అభ్యంతరం తెలుపుతూ వస్తోంది.
దీంతో ఆ నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. స్థానికుడు కావడం, ప్రజల్లో మంచి పలుకుబడి ఉండటంతో బొడ్డు భాస్కర రామారావు పోటీ చేస్తే పెద్దాపురంలో టీడీపీ విజయం ఖాయమని కొందరు నేతలు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న చినరాజప్ప కూడా తనదైన శైలిలో పావులు కదపడంతో ఈ సీటుపై చిక్కుముడి పడింది. దీంతో బొడ్డు భాస్కర రామారావుతో చర్చలు జరిపిన పార్టీ సీనియర్ నేతలు ఆయనకు రాజమహేంద్రవరం ఎంపీ టిక్కెట్ ఇస్తామని చెప్పారు. తొలుత ఈ ప్రతిపాదనకు అంగీకరించని ఆయన ఎట్టకేలకు ఒప్పుకున్నారు. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న మురళీమోహన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించింన సంగతి తెలిసిందే.