చరణ్‌ పడ్డ కష్టం అసాధారణమని చెప్పిన రాజమౌళి

కోసం చరణ్‌ పడ్డ కష్టం అసాధారణమని చెప్పిన రాజమౌళి

రామ్ చరణ్‌ కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న తరుణంలో అతడికి ‘మగధీర’ లాంటి మెగా హిట్టిచ్చి ఒకేసారి సూపర్ స్టార్‌ను చేసేశాడు రాజమౌళి. ఈ విషయంలో జక్కన్నకు మెగాస్టార్ కుటుంబం ఎంతగా రుణపడిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఐతే ‘మగధీర’ తర్వాత పతాక స్థాయికి చేరిన అంచనాల్ని అందుకోవడంలో చరణ్ విఫలమయ్యాడు.సరైన సినిమాలు ఎంచుకోక తన ఇమేజ్‌ను దెబ్బ తీసుకున్నాడు. చివరికి ‘రంగస్థలం’తో మళ్లీ ఓ మోగా విజయాన్నందుకుని తన స్థాయిని పెంచుకున్నాడు. ఇలాంటి టైంలో అతడికి మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ద్వారా జక్కన్నతో పని చేసే అవకాశం లభించింది.

‘మగధీర’కు పని చేసేటప్పటికీ చరణ్ కెరీర్ ఆరంభ దశలో ఉన్నాడు కాబట్టి అతడిలో ఒక ‘రా’నెస్ ఉండేదని.. నిజానికి ‘మగధీర’కు అది బాగా ఉపయోగపడిందని.. పదేళ్ల తర్వాత అతడితో మళ్లీ సినిమా చేస్తున్నపుడు ఎంతో పరిణతి కనిపించిందని రాజమౌళి చెప్పాడు.’రంగస్థలం’ సినిమాతో చరణ్ ఒకేసారి ఎన్నో మెట్లు ఎక్కేశాడని.. ఇప్పుడు అతడికి చిన్న చిన్న విషయాలపైనా ఎంతో అవగాహన వచ్చిందని.. అలవోకగా రామరాజు పాత్రను చేసుకుపోతున్నాడని.. ఈ సినిమా కోసం అతను పడ్డ కష్టం అసాధారణమని రాజమౌళి చెప్పుకొచ్చాడు.