రామాయణం ఓ అపురూప కావ్యం. ఎన్ని భాషల్లో ఎన్నిసార్లు రామాయణం సినిమా, వచ్చినా క్రేజ్ కాస్త కూడా తగ్గలేదు. తగ్గదు కూడా. ఇప్పుడు తాజాగా రామాయణ గాథను రాజమౌళి తెరకెక్కించాలని నెటిజన్ లు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో బాహుబలి దర్శకుడికే అంతటి సత్తా ఉందని అంతా భావిస్తున్నారు. ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా.. తనివి తీరని కావ్యం రామాయణం. తాజాగా రాజమౌళి రామాయణాన్ని సినిమాగా తీయాలని అభిమానులు ట్విట్టర్ లో కోరుతున్నారు.
కోరడం కాదు ఓరకంగా వెంటపడుతున్నారనే చెప్పాలి.రామాయణ ఇతిహాసంపై భారతీయులు కొత్తగా తెలుసుకోవలసింది లేకపోవచ్చు.. కానీ రాముడి గాథ ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమని అందుకే ఇప్పటి వరకూ తెలుగు ఇండస్ట్రీలో ఎన్నిసార్లు రామాయణ గాథ చూపించినా కూడా ప్రేక్షకులు ఆదరించారు. బ్రహ్మరధం పట్టారు. తాజాగా కరోనా లాక్ డౌన్ కారణంగా దూరదర్శన్ లో రామాయణం సీరియల్ ను పునః ప్రసారం చేస్తే దానికి కూడా విశేష ఆదరణ లభించింది. అలాంటి అపురూప కావ్యాన్ని ఇప్పటి ప్రేక్షకులకు సినిమాగా రాజమౌళి తెరకెక్కిస్తే బాగుంటుందని నెటిజన్లు అనుకుంటున్నారు.
అంతేకాదు ట్విటర్ లో రాజమౌళి రామాయణం తెరకెక్కించాలని హ్యాష్టాగ్ రాజమౌళి మేక్ రామాయణ పేరుతో ట్రెండ్ అవుతోంది. మహాభారతం సినిమాను తెరకెక్కించడం తన కోరిక అంటూ రాజమౌళి ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు కూడా. ఇక ఇప్పటికే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దాదాపు పదిహేను వందల కోట్ల భారీ బడ్జెట్ తో రామాయణం సినిమాను తెరకెక్కించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మరి తాజాగా రాజమౌళి రామాయణం సినిమాను తీయాలని అభిమానులు ట్వీట్లు గుప్పిస్తున్నారు. రాజమౌళి మీద దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు అంత నమ్మకం కలగడానికి ప్రధాన కారణం బాహుబలి. రెండు భాగాలుగా వచ్చిన బాహుబలితో భారతీయ సినిమా స్థాయిని ఆయన పెంచారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే రామాయణం, మహాభారతం వంటి పౌరాణిక గాథను తెరకెక్కించాలంటే అది ఒక్క రాజమౌళి వల్లే సాధ్యం అంటున్నారు నెటిజన్లు. అయితే గతంలో ఇతిహాసాలపై సినిమాలు చేయాలనే ప్రస్తావనను రాజమౌళి తిరస్కరించారు. మరిప్పుడు నెటిజన్లు చేస్తున్న డిమాండ్స్ పై రాజమౌళి ఎలా స్పందిస్తారనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.