వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బిజెపి పార్టీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అక్రమ చోరబాటుదారులను కాల్చి చంపాలని, అప్పుడు దేశం సురక్షితంగా ఉంటుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. రోహింగ్యా ముస్లింలను వాళ్ల దేశాలకు వెంటనే పంపించి వేయాలని చెప్పారు. అత్యంత ప్రమాదకరమైన వారిని మన దేశంలో ఉంచుకోవడం హానికరమని అన్నారు. వారు రోహింగ్యాలైనా లేదా బాంగ్లాదేశీలైనా ఎవరైన సరే వారిని దేశం నుంచి తరిమి వేయాలని కేంద్రాన్ని కోరుతున్నానని చెప్పారు. మన దేశాన్ని విడిచి వెళ్లేందుకు వారు అంగీకరించకపోతే కాల్చి చంపాలని అన్నారు.
అసోంలో నివసిస్తున్న 40 లక్షల మంది సాంకేతికంగా ఈ దేశ పౌరులు కారని జాతీయ పౌర రిజిస్ట్రర్(ఎన్ఆర్సీ) తేల్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్ఆర్సీ రిపోర్టుపై రాజాసింగ్ స్పందిస్తూ తెలంగాణ జనాభా విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఉందని అన్నారు. రాష్ట్రంలోని 3.29 కోట్ల జనాభాలో కేవలం 2.89 కోట్లమందే భారత పౌరులంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పాతబస్తీలోని ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో వీరు ఎక్కువగా నివసిస్తున్నారని చెప్పారు. రోహింగ్యాలకు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆర్థికంగా సాయం చేస్తున్నారని ఆరోపించారు. రోహింగ్యా ముస్లింలంతా టెర్రరిస్టులకు అనుకూలంగా ఉంటారని చెప్పారు. భారతదేశం, తెలంగాణ సురక్షితంగా ఉండాలంటే కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ముఖ్యమంత్రి కేసీఆర్ లు వీరిని దేశం నుంచి తరిమికొట్టాలని కోరారు. ఇలా అయితేనే దేశం, దేశ ప్రజలు క్షేమంగా ఉంటారంటూ రాజాసింగ్ వ్యాఖ్యనించారు.