మ్యాచ్ లో ఆడాలంటే…మగువ రావాల్సిందే !

Rajeev Shukla’s aide in alleged ‘sex for selection’ sting,

భారత క్రికెట్ జట్టు సెలెక్టర్లపై యూపీకి చెందిన యువ క్రికెటర్ సంచలన ఆరోపణలు చేశారు. సీనియర్ జట్టు చోటు దక్కాలంటే స్టార్ హోటల్‌కు అమ్మాయిని పంపించాల్సిందేనని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఛైర్మన్ రాజీవ్ శుక్లా సహాయకుడు మొహమ్మద్ అక్రమ్ సైఫీ తనని డిమాండ్ చేశాడని యువ క్రికెటర్ రాహుల్ శర్మ ఆరోపణలు చేశాడు. అక్రమ్- ఉత్తరప్రదేశ్ క్రికెటర్ రాహుల్ శర్మ మధ్య జరిగిన ఫోన్ సంభాషణను ఓ హిందీ న్యూస్ చానల్ బయటపెట్టింది. ఇది సెలక్షన్ కమిటీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జట్టులోకి ఎంపిక చేయాలంటే డబ్బుకు బదులు తనకు అమ్మాయిలను సరఫరా చేయాలని అక్రమ్ అడిగినట్లు ఉత్తర ప్రదేశ్ క్రికెటర్ రాహుల్ శర్మ ఆరోపించాడు. అంతేకాకుండా చాలా మంది ఆటగాళ్లకు ఆయన నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి బీసీసీఐ టోర్నమెంట్లలో పాల్గొనేందుకు సహాయపడుతున్నాడని శర్మ ఆరోపించాడు. ఈ మేరకు అక్రమ్, శర్మ మధ్య జరిగిన ఫోన్ సంప్రదింపుల ఆడియో టేప్‌ను కూడా ఆ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసింది. జట్టులో తనకు కచ్చితంగా స్థానం కల్పిస్తానని శర్మకు అక్రమ్ చెప్పడం మరో ఫోన్ క్లిప్లో స్పష్టమైంది.

శర్మతో పాటు మరికొంత మంది ఆటగాళ్లు అక్రమ్‌పై ఆరోపణలు చేశారు. అయితే వారు తమ పేర్లను బయటపెట్టడానికి ఇష్టపడలేదు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌లో అక్రమ్‌కు ఎలాంటి పదవి లేకపోయినప్పటికీ అతడే షోని నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై అక్రమ్‌ను మీడియా సంప్రదించగా అయితే, రాహుల్ శర్మ ఆరోపణలను సైఫీ కొట్టి పడేశారు. కొందరు ఆటగాళ్లు తనను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనపై వస్తోన్న ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేశారు. ‘నా దగ్గరకు అమ్మాయిని పంపానని ఆ కుర్రాడు చెబుతున్నాడు. అతని ఆరోపణలు నిజమైతే, ఇప్పటితే అతను క్రికెట్ ఆడుతూ ఉండాలి, అవునా? కానీ ఆడుతున్నాడా? లేదు. ఒకవేళ అతను ఉత్తరప్రదేశ్‌కు ఆడి ఉంటే అతడి ఆరోపణలు నిజమై ఉండేవి. ఉత్తరప్రదేశ్ 60 మంది క్రీడాకారుల జాబితాలో అతని పేరు ఎప్పుడూ కనబడలేదు. అసలు అతను జూనియర్ క్రికెట్ ఆడలేదు’ అని అక్రమ్ వివరణ ఇచ్చారు. తనపై ఆరోపణలు చేయడానికి ‘శర్మ అండ్ కో’ మూడేళ్లు ఎందుకు ఆగారో చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, అక్రమ్ ఆరోపణలకు సంబంధించి షోను ప్రసారం చేసిన టీవీ రికార్డు చేసిన సంభాషణ ఎప్పుడు జరిగిందీ వెల్లడించకపోవడం కొసమెరపు.