పాలిటిక్స్ పట్ల ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉండిపోయిన సూపర్ స్టార్ రజినీకాంత్.. రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. జనవరిలో పార్టీ పేరును, విధివిధానాలను ప్రకటించారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 234 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని రజినీ ప్రకటించారు. 2017లోనే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రజినీ.. ఇన్నాళ్లపాటు సైలెంటయ్యారు.
అన్నాడీఎంకే, డీఎంకే లాంటి పార్టీలు ఉన్నప్పటికీ.. జయలలిత, కరుణానిధి మరణంతో తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పార్టీ పెడితే ప్రయోజనం ఉంటుందని రజినీకాంత్ భావిస్తున్నారు. రజినీ రాజకీయపార్టీ ఏర్పాటు విషయమై రాజకీయ నాయకులు ఆచితూచి స్పందిస్తున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ పార్టీ ఏర్పాటు విషయమై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘2013లో తాను జనతాపార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నానని ప్రకటించిన తర్వాత.. అప్పటి జనతా పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యకర్తలను తమిళనాడు బీజేపీ దూరం పెట్టింది. వాళ్లంతా అనుభవం ఉన్న కార్యకర్తలు. కానీ బీజేపీ మాత్రం డీఎంకే, ఇతర పార్టీలకు చెందిన వారిని పార్టీలోకి ఆహ్వానించింది. గతంలో జనతా పార్టీ కోసం పని చేసిన వారంతా రజినీకాంత్ పార్టీలో చేరే అవకాశం ఉంది’’ అని సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు.