రాజకీయాల్లోకి వస్తామంటూ చెప్పిన ఇద్దరు అగ్రనటుల్లో కమల్ ఇప్పటికే మక్కల్ నీది మయ్యమ్ పార్టీని పెట్టేయగా.. రజనీ మాత్రం తన పొలిటికల్ ఎంట్రీ గురించి స్పష్టత ఇవ్వలేదు.ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో రజనీ మీద విమర్శలు చేసిన అన్నాడీఎంకే నేతలకు షాకిచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక.. రానున్న కొద్ది నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కమల్.. రజనీల మధ్య చోటు చేసుకున్న పొత్తు.. కొత్త ఎత్తుగా మారటమే కాదు తమిళ పార్టీలకు షాకిచ్చేలా మారిందని చెప్పాలి.
సినీ రంగంలో రజనీ.. కమల్ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య చక్కటి సోదర భావం ఉంది. రాజకీయంగా భిన్న ధ్రువాలుగా మారితే.. వీరి మధ్య మాటలు ఎలా ఉంటాయన్న ఉత్కంట ఉండేది. తాజాగా చోటు చేసుకున్న పరిణామం కొత్త కాంబినేషన్ కు తెర తీసిందని చెప్పాలి. నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం రాత్రి ఇద్దరం కలిసి అసెంబ్లీ ఎన్నికలకు వెళదామంటూ కమల్ హాసన్ చేసిన ప్రతిపాదనకు.. కాస్త తేడాతో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పచ్చజెండా ఊపేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటల వేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై రజనీకాంత్ కు కమల్ హాసన్ ప్రతిపాదన చేశారు. ఈ పరిణామం చోటు చేసుకున్న కాసేపటికే (రాత్రి 7.45 గంటల వేళలో) పొత్తుకు తాను సిద్ధమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు రజనీ.
అత్యంత ప్రజాదరణ ఉన్న రజనీ.. కమల్ హాసన్ లు కలిసి ఒకటిగా మారితే.. అధికారపక్షమైన అన్నాడీఎంకేకు.. విపక్షమైన డీఎంకేకు ఇబ్బంది తప్పదు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల వేళలోనూ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కమల్ పార్టీ చక్కటి ఓటుబ్యాంకును నమోదు చేసింది. ఇలాంటివేళ.. కమల్ కు రజనీ తోడైతే.. ఇప్పటికే ఉన్న పార్టీలకు తాజా పరిణామం షాకింగ్ గా మారుతుందన్న మాట వినిపిస్తోంది.ఇదిలా ఉంటే.. రజనీ.. కమల్ లు చేతులు కలిపితే తమిళనాడుకు మేలు జరుగుతుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాలతో తమిళనాట ఉత్కంటభరితమైన త్రిముఖ పోటీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెలకొంటుందని చెప్పకతప్పదు