Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆధ్యాత్మిక రాజకీయం అని భారతీయ రాజకీయాల్లో వినడం ఇదే మొదలు. మతానికి, ఆధ్యాత్మికతకు వున్న తేడా అర్ధం చేసుకోలేని చాలా మంది రజనీ తో బీజేపీ ని ముడిపెట్టేస్తున్నారు. అందులో నిజం లేదని చెప్పేందుకే తమ పార్టీ గుర్తు గా అనుకుంటున్న అపాన ముద్ర బ్యాక్ గ్రౌండ్ లో వున్న తామర పువ్వుని తొలగించారు రజనీ. అయితే సమస్య అక్కడితో అయిపోలేదు. అక్కడే అసలు సమస్య మొదలైంది. మతం, ఆధ్యాత్మికత రెండూ వేర్వేరు అని చెప్పాల్సిన పరిస్థితులు వున్న సమాజంలో నిజంగా రజనీ అనుకుంటున్న రాజకీయం చేయడం సాధ్యమా ? అసాధ్యం కాకపోవచ్చు కానీ… అనుకున్నంత తేలిక కాదు.
ఇప్పటి దాకా సమాజాన్ని బట్టి రాజకీయం , రాజకీయాల్ని బట్టి సమాజం నడిచాయి. అందుకే ఇప్పటికీ ఓటు కొనేవాడిది తప్పా, అమ్ముకునేవాడి తప్పా అంటే చెప్పలేకపోతున్నాం. ఇలాంటి సమాజంలో ఆధ్యాత్మిక రాజకీయం అంటే మాటలు కాదు. నిజానికి ఓ మనిషి రాజకీయంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా ముందుకు నడిచేది భౌతిక అవసరాలు, కోరికలు, లక్ష్యాలు నెరవేరినప్పుడు మాత్రమే. అంతా అనుభవించాకే అసలైన వైరాగ్యం పుడుతుంది. తీసుకోవడంలో కాకుండా ఇవ్వడంలో ఆనందం ఏమిటో అర్ధం అవుతుంది. ఆ దశలు ఆధ్యాత్మిక రాజకీయం అంటున్న రజనీ దాటారేమో గానీ అయన మీద అభిమానం పెంచుకున్న చాలా మందికి అదేమిటో కూడా తెలియదు. సినిమాల్లో లాగే హీరోలా రజనీ తమ కష్టాలు తీరుస్తాడని సగటు తమిళుడు అనుకుంటున్నాడు. వారికి ఆకలి తెలుసు. ఆ బాధ తీర్చుకోడానికి పడే కష్టం తెలుసు. అంత కష్ట పడ్డా ఆకలి తీరని రోజులు తెలుసు. పొట్ట ఆకలి తీరగానే పుట్టే ఆశలు తెలుసు. వాటిని నెరవేర్చుకోడానికి పడే పాట్లు తెలుసు. వీటి మధ్య నలిగిపోయే సగటు మనిషికి ఆధ్యాత్మిక రాజకీయం అంటే అర్ధం కాదు.
రజని ఏ అర్ధంలో ఈ మాటను వాడారో గానీ పేరు ఏదైనా రాజకీయం పరమార్ధం సగటు మనిషి, అణగారిన వర్గాలకు నిజంగా మేలు చేసేదిగా ఉంటే చాలు. అంటే లక్ష్యాలు ఉన్నతంగా ఉండడం కన్నా ఆచరణ సాధ్యమైన చిన్న చిన్న అంశాల్లో నీతి, నిజాయితీతో ఎప్పుడైతే పాలనా వ్యవస్థ ముందుకు నడుస్తుందో అప్పుడే అసలైన మార్పు వస్తుంది. ఉన్నత లక్ష్యాల కన్నా చిన్న చిన్న పద్ధతులు పాటించడమే సమాజానికి మేలు చేస్తాయి. ఆపై ఉన్నత లక్ష్యాలు తేలిగ్గా నెరవేరతాయి. ఈ విషయాన్ని గ్రహించి రజనీ కూడా పెద్ద పెద్ద మాటలు పక్కనపెట్టి రోజువారీ జీవితంలో ప్రభుత్వ పాత్ర కనిపించే ప్రతి సందర్భంలో నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యతాయుతం గా వ్యవహరించేలా చూసే విధానాన్ని రూపకల్పన చేసే దిశగా ఆలోచించాలి. లక్ష్యం ఎంత పెద్దది అయినా దాన్ని ఆచరించే సరైన మార్గం లేకుంటే కష్టమే . రాజకీయాల్లో పెద్ద పెద్ద మాటలు, వాగ్దానాలు ఆశించిన వాళ్లకి అధికారం ఇస్తాయేమో గానీ అది అందించిన వాడికి మాత్రం చిన్న చిన్న విషయాలతోనే అసలైన ప్రయోజనం సిద్ధిస్తుంది. ఈ విషయాన్ని గుర్తు ఎరిగి రాజకీయ సిద్ధాంతం మీద కన్నా ఆచరణ, ప్రణాళిక మీద రజనీ దృష్టి పెట్టాలి. లేదంటే ఆకలితో ఉన్నవాడికి ఆధ్యాత్మికత ఎక్కదన్న చేదు వాస్తవాన్ని జీర్ణించుకోడానికి సిద్ధంగా ఉండాలి.