Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
“మక్కల్ నీతి మయ్యం”… పార్టీ ప్రకటనతో కమల్ హాసన్ ఒక్క తమిళ రాజకీయాలనే కాదు మొత్తం జాతీయ రాజకీయాల మీద తన ముద్ర వేయాలి అనుకుంటున్నాడు. ఆది నుంచి ప్రధాని మోడీ, బీజేపీ ని ప్రత్యర్థిగా భావించి అడుగులు వేస్తున్న కమల్ అంతటి దిగ్గజం మీద పోరాటానికి కూడా ఓ దారి ఎంచుకున్నాడు. అదే ఆయన ప్రకటించిన పార్టీ చిహ్నంలో కూడా ప్రతిబింబిస్తోంది. అయితే ఆ విషయాన్ని కమల్ బహిరంగంగా ప్రకటించలేదు. ఇంతకీ ఆ పార్టీ చిహ్నంలో వున్న చిదంబర రహస్యం ఏమిటంటే…
ఐకమత్యానికి గుర్తుగా ఒక చేతిని పట్టుకున్న ఇంకో చేయి… ఆ చేతిని పట్టుకున్న ఇంకో చేయి … ఇలా ఆరు చేతులు కమల్ పార్టీ చిహ్నంలో కనిపిస్తున్నాయి. ఈ ఆరు చేతులు ఆరు దక్షిణాది రాష్ట్రాలు. ఆంధ్ర, తెలంగాణ, తమిళ నాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి… మోడీ పాలనలో దక్షిణాది రాష్ట్రాల పట్ల చిన్న చూపు పెరిగిందని బలంగా వినిపిస్తున్న మాట. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మినహా ఈ అంశాన్ని ఏ రాజకీయ పార్టీ రాజకీయానికి వాడుకోడానికి ట్రై చేయలేదు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో అసంతృప్తి పెరుగుతున్న వేళ ఇదే విషయాన్ని బలంగా వినిపించాలని కమల్ భావిస్తున్నారట. అందుకే దక్షిణాదిలో బలమైన నేతల్లో ఒకరైన చంద్రబాబు పేరుని ఆయన ప్రస్తావించారు. చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు కూడా ప్రాంతీయ భావోద్వేగాల మీద తాను నేరుగా గళం ఎత్తలేకపోయినా కమల్ లాంటి వాళ్ళు గొంతు ఎత్తితే అండగా నిలిచే అవకాశం లేకపోలేదు. ఇదే ఆలోచనతో తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సైతం కమల్ కి చెప్పడంలో ముందున్నారు.
ఇదంతా పైకి కనిపిస్తున్న వ్యవహారం అయితే ఈ ఎత్తుగడ ద్వారా మరో కొత్త పార్టీ తో తమిళ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్న రజనీని నిలువరించడానికి కమల్ సూపర్ ప్లాన్ వేశారు. రజనితో రాజకీయ బంధానికి ప్రయత్నం చేస్తున్న కమల్ అందులో ఏ కాస్త తేడా వచ్చినా ఉత్తరాది, దక్షిణాది అంశాన్ని తెర పైకి తేవచ్చు. రజని కాంత్ మరాఠీ మూలాల గురించి ప్రశ్నించవచ్చు. ఇక మోడీ, బీజేపీ కి దూరంగా వుండాలని రజనికి కమల్ ఎన్నోసార్లు సలహా ఇచ్చారు. రజనికి కూడా మోడీ వ్యతిరేకత తమిళ నాట ఏ స్థాయిలో వుందో అర్ధం చేసుకోగలిగారు. అందుకే ఆయన పార్టీ చిహ్నం నుంచి తామర పువ్వు ఎగిరిపోయింది. మొత్తానికి ఆరు చేతుల గుర్తు తో రజనీని కమల్ దిగ్బంధం చేసేస్తున్నాడు.