Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం చేస్తున్న ‘2.0’ మరియు ‘కాలా’ చిత్రాల తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడని, అందుకే ఆ చిత్రాల తర్వాత రజినీకాంత్ కొత్త సినిమాలకు కమిట్ అయ్యే అవకాశం లేదని తమిళ సినీ వర్గాల వారు నిన్న మొన్నటి వరకు అంటూ వచ్చారు. కాని తాజాగా రజినీకాంత్ తీసుకున్న నిర్ణయం ఆయన అభిమానులతో పాటు, సినీ వర్గాల వారికి షాక్ ఇచ్చింది. ‘పిజ్జ’ చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఒక చిత్రాన్ని రజినీకాంత్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
రజినీకాంత్ ఇకపై సినిమాలు చేయడని భావిస్తున్న తరుణంలో షాకింగ్‌గా ఒక చిన్న దర్శకుడికి ఓకే చెప్పడంతో అంతా కూడా నోరెళ్లబెడుతున్నారు. సూపర్ స్టార్‌తో సినిమాలు చేసేందుకు దిగ్గజ దర్శకులు సిద్దంగా ఉంటే ఎందుకు చిన్న దర్శకుడు అయిన సుబ్బ రాజు దర్శకత్వంలో రజినీకాంత్ చేయాలని కోరుకుంటున్నాడు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్లో కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తెలుగు మరియు తమిళంలో ఈ చిత్రాన్ని ఒకేసారి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. తక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రజినీకాంత్ రెండు చిత్రాలు కూడా పూర్తి అయ్యి, విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఆ రెండు సినిమాలు విడుదలకు ముందే రజినీకాంత్ తర్వాత సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఒక వైపు రజినీకాంత్ కొత్త సినిమాకు కమిట్ అయ్యాడని ఫ్యాన్స్ సంతోషపడుతుండగా, మరి కొందరు మాత్రం రజినీకాంత్ రాజకీయాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని బాధను వ్యక్తం చేస్తున్నారు.