రజిని ఆధ్యాత్మిక రాజకీయం ఎలా ఉంటుంది ?

rajinikanths-statement-that-he-will-make-spiritual-politics

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రజని రాజకీయ రంగప్రవేశమే ఓ సంచలనం అయితే అంతకు మించిన సంచలనం ఆయన ప్రకటనలో కనిపించింది. కులాలకు అతీతంగా ఆధ్యాత్మిక రాజకీయం చేస్తానంటూ రజని ఇచ్చిన స్టేట్ మెంట్ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ దేశం భక్తి ఉద్యమాన్ని చూసింది. ఆధ్యాత్మిక విప్లవాన్ని నడిపింది. రాజకీయ పోరాటాలు చేసింది. రాజకీయ విప్లవాలకు వేదికైంది. కానీ ఆధ్యాత్మిక రాజకీయం అన్న మాట ఎక్కడా చూడలేదు. వినలేదు. రాజకీయం,పరిపాలన వద్దు అని నిర్ణయానికి వచ్చాకే గౌతముడు బుద్ధుడిగా మారి ఆధ్యాత్మిక బాటలో పయనించారు. ఇక అశోకుడు కళింగ యుద్ధం తరువాత శాంతి కాముకుడై బుద్ధుని బాటలో నడిచాడు. ఇక వ్యక్తిగతంగా ఇస్లాం మత విశ్వాసాలు పాటించిన ఔరంగజేబు పాలనలోనూ ఆ ముద్ర ఎంతో కొంత కనిపించేది. ఇవన్నీ చెబుతున్న కారణం ఏమిటంటే వీళ్ళలో కొందరు రాజకీయం వద్దు అనుకున్నాకే ఆధ్యాత్మికత వైపు మళ్ళారు. ఇక ఇంకొందరు తాము అనుసరించే మత విశ్వాసాల్ని పాలనలోనూ జోడించడానికి ప్రయత్నించారు.

super star rajinikanth political news

కులం,మతం పేరు చెప్పి దేశంలో రాజకీయం చేయడం కొత్త కాకపోయినా ఆధ్యాత్మికత పేరుతో రాజకీయం చేస్తామనడం, అది కూడా అధికారానికి రాక ముందే ఆ మాట చెప్పడం విశేషమే. ఆధ్యాత్మికత అనగానే చాలా మంది రజని ని బీజేపీ భావజాలంతో ముడిపెడుతున్నారు. కానీ వీళ్లంతా ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఆధ్యాత్మికత అంటే ఒక్క హిందూ భావజాలానికి పరిమితం కాదు. ఏ మత విశ్వాసాలు పాటించేవారు, నమ్మేవారు అయినా ఆధ్యాత్మిక పరిమితుల్లో వున్నవారే. హిందూ,ముస్లిం, క్రైస్తవ, సిఖ్,జైన్ …ఇలా ఏ మతాన్ని నమ్మే వాళ్ళు అయినా ఆధ్యాత్మిక భావనలో కొనసాగుతున్నవాళ్ళే. ఓ విధంగా చెప్పాలంటే రజని చెప్పిన ఆధ్యాత్మిక రాజకీయం మాట నాస్తికులకు మాత్రమే నచ్చకపోవచ్చు.

super star rajinikanth political news

రాజనీతి శాస్త్రాన్ని కాచివడపోసిన వాళ్ళు సైతం రాజకీయాలపై కుల,మత ప్రభావాన్ని విశ్లేషించారు తప్ప ఆధ్యాత్మికత ఆధారంగా రాజకీయాల్లో పాలనా పగ్గాలు చేపట్టే ఆలోచన వస్తుందని ఊహించలేకపోయారు. ఆ విధంగా చూసినప్పుడు రజని చెప్పిన ఆధ్యాత్మిక రాజకీయం ఎలా వుండబోతోందన్న చర్చ అప్పుడే మొదలైంది. బీజేపీ పేరు చెబితే మండిపోతున్న తమిళనాడులో ప్రస్తుతం ఆ పార్టీ అనుకూల రాజకీయాలు చేసి చెడ్డ పేరు తెచ్చుకోవాల్సిన అవసరం రజనికి ఏ మాత్రం లేదు. ఇది ఇప్పటికే ఆయన మాటల ద్వారా అర్ధం అవుతున్న ఆధ్యాత్మిక రాజకీయం అన్న మాటతో ఎక్కడో సందేహం. ఆ సందేహాన్ని తీర్చి తాను అనుకుంటున్న ఆధ్యాత్మిక రాజకీయం ఎలా ఉండబోతోందో చెప్పవలసిన బాధ్యత మాత్రం రజని మీదే వుంది.