‘‘ఒక వార్త రాసే ముందు మీడియా నిజమేంటో? అబద్ధమేంటో చెక్ చేసుకుని రాసే రోజు ఎప్పుడొస్తుందో? కొన్ని హిట్స్ కోసం నిరాధారమైన వార్తలు రాయడం సరికాదు. బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని మనం ఎప్పుడు చూస్తామో?’’ అని మండిపడ్డారు రకుల్‌ప్రీత్ సింగ్. ఈ బ్యూటీ ఎందుకింత ఆగ్రహం వ్యక్తం చేశారంటే.. శివకార్తికేయన్ సరసన తమిళంలో ‘అయలాన్’ అనే సినిమా చేయడానికి రకుల్ అంగీకరించారు. ఈ సినిమా షూటింగ్ ఆరంభించాలనుకున్నారట.
అయితే కరోనా అనేది పూర్తిగా తగ్గేవరకూ షూటింగ్‌కి హాజరయ్యేది లేదని ఆ చిత్రనిర్మాతను రకుల్ ఇబ్బందిపెడుతోందనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తకే రకుల్ పై విధంగా స్పందించారు. అది మాత్రమే కాదు. ‘‘షూటింగ్ ఎప్పుడు ఆరంభమవుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే పని చేయడానికి ఆసక్తిగా ఉన్నాను’’ అన్నారు రకుల్. ఈ వార్తలకు ‘అయలాన్’ చిత్రదర్శకుడు రవికుమార్ స్పందిస్తూ – ‘‘రకుల్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. ఆమె గురించి వదంతులు రాయడం దురదృష్టకరం’’ అన్నారు.