స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఛత్రివాలీ’. తేజస్ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కండోమ్ టెస్టర్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల లక్నోలో పూర్తయింది. దాదాపు 45 రోజులు ఈ సినిమా కోసం లక్నోలో ఉన్న రకుల్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లక్నోలో ఇన్ని రోజులు షూటింగ్‌లో పాల్గొనడం నా కెరీర్‌లో ఇదే తొలిసారి. ఇండస్ట్రీలో నాకు మార్పు కనిపిస్తోంది. సినిమాల్లో వర్క్ చేసే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. మహిళా దర్శకులు, రచయితలు ఇండస్ట్రీకి వస్తున్నారు. ఇదే విధానం భవిష్యత్‌లోనూ కొనసాగాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పింది.
అలాగే బాలీవుడ్ హీరో, నిర్మాత జాకీ భగ్నానితో తన పెళ్లిపై కూడా స్పందించింది. ‘‘ప్రస్తుతం నా ఏకాగ్రత అంతా పనిపైనే ఉంది. నా ప్రేమ విశేషాలను సరైన సమయంలో చెబుతాను. దేనికైనా టైమ్ రావాలి’’ అంటూ ఓ చాలెంజింగ్ రోల్ వస్తే వెబ్ సిరీస్‌లో నటించేందుకు సిద్ధమే అంటూ రకుల్ చెప్పుకొచ్చింది. కొంతకాలం జాకీ భగ్నానీతో సీక్రెట్‌గా ప్రేమ వ్యవహరం నడిపిన రకుల్ ఇటీవల తన రిలేషన్‌పై అధికారిక ప్రకటన ఇచ్చింది. దీంతో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందంటూ వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు రకుల్ కానీ జాకీ భగ్నానీ కానీ స్పందించలేదు. అయితే కేరీర్ ఫుల్ జోష్‌లో ఉండగానే రకుల్ పెళ్లి చేసుకోవడంపై కొందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.