Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించనున్నారన్న వార్తలు వచ్చినప్పటినుంచి తెలుగు సినీ అభిమానుల దృష్టంతా ఆ సినిమాపైనే ఉంది. బాహుబలి వంటి సినిమా తర్వాత రాజమౌళి ఎలాంటి మూవీ తీస్తారనేదానిపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. దానికి తగ్గట్టు ఆయన నందమూరి, మెగా ఫ్యామిలీలను కలిపి తెరపై చూపించేందుకు సిద్ధమవడంతో సినిమాపై ఇప్పటినుంచే హైప్ నెలకొంది. నిజానికి బాహుబలి తర్వాత కొన్నిరోజులు విశ్రాంతి తీసుకున్న రాజమౌళి… చిరంజీవి, రాంచరణ్ తేజలతో కలిసి కనిపించడంతో… ఆయన తదుపరి సినిమా మెగా పవర్ స్టార్ తో అని ఊహాగానాలు బయలుదేరాయి. అయితే రాజమౌళి ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్ సెట్ చేసి అందరికీ షాకిచ్చారు. రాజమౌళి స్థాయికి తగ్గట్టుగా ఈ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో తారక్, చెర్రీ ఇద్దరూ బాక్సర్లుగా కనిపించనున్నట్టు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం ఇద్దరు హీరోలు ఫిట్ నెస్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నట్టు సమాచారం. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మించే ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. 2019వేసవిలో సినిమా విడుదలయ్యే అవకాశముంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అటు ఈ సినిమా టైటిల్ పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ అంతకంతకూ పెరుగుతోంది. సోషల్ మీడియాలో సినిమాపేరుపై తెగ చర్చ జరుగుతోంది. కొందరు అభిమానులు ఎన్టీఆర్ యమదొంగలోని యమ, చరణ్ మగధీరలోని ధీర కలిపి యమధీర టైటిల్ పెట్టమని రాజమౌళికి సలహాలు కూడా ఇస్తున్నారు.