తెలుగు హీరోలు ఈమద్య ఎక్కువగా బ్రాండ్ అంబాసిడర్స్‌గా వ్యవహరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. 2016 వరకు మహేష్‌బాబు మాత్రమే పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేవాడు. ఇతర హీరోలు అడపా దడపా కనిపిస్తూ వచ్చేవారు. అయితే ఈమద్య హీరోలు ఆదాయ మార్గంను పెంచుకునేందుకు కంపెనీలను ప్రమోట్ చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇటీవలే రామ్ చరణ్ ప్రముఖ మొబైల్ స్టోర్ సంస్థ అయిన హ్యాపీ మొబైల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక అయ్యాడు. ఈయన యాడ్స్ మరియు హోర్డింగ్స్ ప్రస్తుతం తెగ సందడి చేస్తున్నాయి. ఈ సమయంలోనే ఎన్టీఆర్ మరో మొబైల్ స్టోర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా చేసేందుకు సిద్దం అయ్యాడు.
తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున స్టోర్స్‌ను పెట్టేందుకు సెలక్ట్ సంస్థ సిద్దం అయ్యింది. సెలక్ట్ మొబైల్ స్టోర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్ వ్యవహరించబోతున్నాడు. త్వరలోనే ఎన్టీఆర్ హైదరాబాద్‌లో సెలక్ట్ స్టోర్‌ను ప్రారంభించడంతో పాటు, యాడ్స్ చిత్రీకరణలో కూడా పాల్గొనబోతున్నాడు. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్‌లు పోటా పోటీగా ఉన్న హ్యాపీ మరియు సెలక్ట్ మొబైల్ స్టోర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్న నేపథ్యంలో ఆ రెండు స్టోర్‌ల మద్య నెలకొన్న పోటీ వాతావరణంలో ఏది పై చేయి సాధిస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక బ్రాండ్ అంబాసిడర్స్‌గా పోటీ పడుతున్న వీరిద్దరు త్వరలోనే రాజమౌళి దర్శకత్వంలో కలిసి నటించేందుకు కూడా సిద్దం అవుతున్నారు. ఒక వైపు పోటీ పడుతూ మరో వైపు ఇలా కలిసి నటించడం వింతైన అనుభవంగా చెప్పుకోవచ్చు.