వెండితెరపై ఎన్టీఆర్‌గా ఆయన తనయుడు బాలకృష్ణను చూశాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టిని తిలకించాం. చంద్రబాబు పాత్రలో రానా దగ్గుబాటి, శ్రీతేజ్ లాంటి వాళ్లను చూశాం. అయితే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో కీలక పాత్రధారి జగన్‌ను మాత్రం ఇంకా వెండితెరపై ఎవరూ చూడలేదు. వైఎస్ మీద తీసిన యాత్ర సినిమాలో జగన్ పాత్రే లేదు.
అయితే ఇప్పుడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. జగన్ పాత్రను తెరమీదికి తెస్తున్నాడు. చివరగా లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటి స్థాయి తక్కువ పొలిటికల్ మూవీతో పలకరించిన వర్మ.. మళ్లీ అదే తరహా ప్రయత్నం చేస్తున్నాడు. అదే.. కమ్మరాజ్యంలో కడప రెడ్లు.
ఈ సినిమా ట్రైలర్‌ను దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు వర్మ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రైలర్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. అందులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్రధారులైన చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్‌ల పాత్రల్ని పరిచయం చేశాడు. బాబు పాత్రను ఎవరు చేస్తున్నారన్నది తెలియడం లేదు కానీ.. ఆ పాత్రకు ఆ నటుడు పర్ఫెక్టుగా సూటయ్యాడు. మేకప్ బాగా కుదిరింది.
పవన్ పాత్రధారి కాస్త అటు ఇటుగా కనిపిస్తున్నాడు. అతడి ఎక్స్ప్రెషన్ బాగుంది. జగన్ పాత్ర విషయానికి వస్తే రంగం సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయం అయిన తమిళ నటుడు అజ్మల్‌తో వర్మ ఈ క్యారెక్టర్ చేయిస్తున్నాడు. సినిమాలో కాస్త పేరున్న నటుడు అతనొక్కడే అయ్యుండొచ్చు. మరి అతను జగన్ హావభావాల్ని ఎలా పలికిస్తాడో చూడాలి.