రామోజీ రావు కేవలం ఫౌండర్ స్థానానికి మాత్రమే పరిమితం అయ్యారు. రామోజీ బతికుండగా ఇలా జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. తుది శ్వాస వరకు ఆయన ‘ఈనాడు’ చీఫ్ ఎడిటర్‌గా కొనసాగుతారని అంచనా వేశారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఆయన ఎడిటర్ స్థానం నుంచి తప్పుకున్నారు.
రామోజీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా వయసే కారణమన్నది అంతర్గత వర్గాల సమాచా రం. ఆయన మునుపటంత చురుగ్గా లేరు. వయసు పరమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒంట్లో ఓపిక తగ్గింది. పత్రిక రోజువారీ వ్యవహారాలకు ఆయన చాలా కాలం కిందటే దూరమయ్యారు. నామమాత్రంగా ఎడిటర్ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. అన్ని వ్యవహారాలూ కొడుకు కిరణే చూసుకుంటున్నాడు. ఆయన పత్రికకు ఎండీ కూడా. ఐతే పత్రికలో వార్తలకు సంబంధించి ఎవరు ఏ కేసు వేసినా.. ఎడిటర్‌గా దానికి బాధ్యత వహించాల్సింది రామోజీనే.
చాలా వరకు కోర్టుకు హాజరయ్యే అవసరం లేకుండా చూస్తారు కానీ.. కొన్ని తీవ్రమైన, దీర్ఘకాలిక కేసుల కోసం అప్పుడప్పుడూ కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ వయసులో రామోజీకి అంత ఓపిక ఉండట్లేదు. కాబట్టి ఇక ప్రశాంతంగా ఉండటం కోసం ఎడిటర్ స్థానం నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. అలాగే తాను కాలం చేయడానికి ముందే అన్నీ సెటిల్ చేసి వెళ్లే ఉద్దేశంతో కూడా ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.