ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమవుతోంది. సుప్రసిద్ధ అయోధ్యలో భవ్యరామమందిరలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠకు సుమూహుర్తం ఖరారైంది. యూపీలోని అయోధ్య రామాలయంలో వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా మృగశిర నక్షత్రంలో అభిజిత్ ముహుర్తంలో ఈ మహత్తర కార్యక్రమం నిర్వహించనున్నారు.
అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు సంఘ్ పరివార్ కసరత్తు చేస్తోంది. సాకేత్ నిలయంలో సంఘ్ పరివార్ సమావేశం నిర్వహించి.. ప్రాణ ప్రతిష్ఠ ముహుర్తాన్ని ఖరారు చేసింది. రామ్‌లల్లా ప్రతిష్ఠాపన వేడుకలను నాలుగు దశలుగా విభజిస్తున్నట్లు తెలిపింది.
తొలి దశలో మొత్తం కార్యాచరణను సిద్ధం చేసి.. అందుకు పలు స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు సంఘ్ పరివార్ తెలిపింది. కార్యక్రమ నిర్వహణకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. రెండో దశలో 10 కోట్ల కుటుంబాలకు రాముడి చిత్రపటం, కరపత్రం అందించనున్నట్లు పేర్కొంది.
ప్రాణప్రతిష్ఠ రోజు.. దీపోత్సవం జరపాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ దశ.. 2024 జనవరి 1న ప్రారంభం కానున్నట్లు సమాచారం. మూడో దశలో జనవరి 22వ తేదీన దేశంలో అనేక ప్రాంతాల్లో వేడుకలు.. నాలుగో దశలో జనవరి 26వ తేదీ నుంచి భక్తులకు అయోధ్య రాముడి దర్శనం కల్పించనున్నారు.