కేసీఆర్ ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు ?

Telangana Ministers Kcr

తెలంగాణలో తిరుగులేని విజయంతో మంచి ఊపు మీదున్న టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ మిగతా పార్టీలను ఖాళీ చేసే వ్యూహాల్లో ఉన్నారు. అసెంబ్లీలో పూర్తి ఆధిక్యంతో ఉన్న టీఆర్ఎస్ మండలిలోనూ విపక్షమన్నది కనిపించకుండా చేయాలని అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్సీలు గులాబీ రంగేసుకున్నారు. పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు వేసి.. కొత్తగా పార్టీ నేతలకు చోటివ్వాలనుకుంటున్న టీఆర్ఎస్ ముఖ్యనేతలకు కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్‌లో కొండా మురళి, రాములు నాయక్, భూపతిరెడ్డి, యాదవరెడ్డిలపై అనర్హతా వేటు వేయాలని టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే శాసనమండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఇప్పటికే.. వారికి నోటీసులు జారీ అయ్యాయి. బుధవారం తర్వాత ఏ క్షణమైనా వారిపై అనర్హతా వేటు పడే అవకాశం ఉంది. ఈ లోపే కొండా మురళి తన పదవికి రాజీనామా చేశారు. శాసనమండలి చైర్మన్ ఆమోదించారు కూడా. ఇక.. మిగిలింది ముగ్గురు. వీరిలో ఒకరు రాములు నాయక్. ఎన్నికల ముందు టీఆర్ఎస్‌ను ధిక్కరించిన రాములు నాయక్‌పై బహిష్కరణ వేటు వేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్‌ను కోరారు. చైర్మన్ నోటీసులివ్వడంతో రాములు నాయక్ ఆయనను కలిసి వివరణ ఇచ్చేందుకు 4 వారాల టైం అడిగారు. తాను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితుడయ్యానని… కాబట్టి తానేమీ టిఆర్ఎస్ సభ్యుడిగా పరిగణించలేరు అనేది రాములు నాయక్ వాదన. అలాంటప్పుడు తనపై వేటు వేయాలని టిఆర్ఎస్ ఎల్పీ తరుపున ఎలా ఫిర్యాదు చేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. సోమవారం మండలి ఛైర్మన్ ను కలిసిన ఆయన తన వివరణ ఇచ్చేందుకు నాలుగు వారాలు గడువు కావాలని కోరారు. తనను ఏ ప్రాతిపదికన ఎమ్మెల్సీగా నియమించారో చెప్పాలని రాజ్ భవన్ వర్గాలను సమాచార హక్కు చట్టం ద్వారా కోరినట్లు చెప్పారు. గవర్నర్ నుంచి సమాచారం రాగానే శాసనమండలి ఛైర్మన్ నోటీసుకు వివరణ ఇస్తానని ఆయన చెప్పారు. తనకు సోషల్ వర్కర్ గానే నాకు గవర్నర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని రాములు నాయక్ వెల్లడించారు.

MLC-Ramulu-Naik,

అంతేకానీ, టీఆర్ఎస్ నుంచి తాను ఎంపికైనట్లు కాదని చెప్పారు. రాములు నాయక్ లాజిక్‌తో టీఆర్ఎస్ నేతలు కంగు తిన్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణ ఖేడ్ స్థానం నుంచి పోటీ చేయాలని రాములు నాయక్ ఆశించారు. అయితే, టీఆర్ఎస్ అధిష్టానం మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేకే అవకాశం ఇచ్చింది. దీంతో, రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతో పాటు, ఆ పార్టీ ప్రముఖులతో భేటీ అయ్యారనే సమాచారంతో టీఆర్ఎస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. ఆయనను ఎమ్మెల్సీగా అనర్హుడిగా ప్రకటించాలంటూ మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది.నిజానికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంటే పార్టీ కిందకు రారు. ఇప్పటి వరకూ వారు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు వస్తారా రారా అన్న చర్చ రాలేదు. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. నేరుగా గవర్నర్ వివిధ రంగాల ప్రముఖుల పేరుతో అపాయింట్ చేసినందున పార్టీ తరపున కాదు కాబట్టి సహజ న్యాయసూత్రాల ప్రకారం… ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. కానీ అవకాశమే లేని కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేసిన శాసనమండలి చైర్మన్ ఈ విషయంలోనూ తన అధికారాన్ని పరిమితికి మించి ఉపయోగించే అవకాశం ఉంది.