Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్లో విలక్షణ పాత్రలతో దూసుకుపోతున్న ప్రముఖ సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రావు గోపాలరావు కొడుకుగా రావు రమేష్ తెలుగు వారందరికీ పరిచితమే. రావు రమేష్ తల్లి, రావు గోపాలరావు భార్య అయిన కమలాకుమారి అనారోగ్యంతో ఈరోజు ఉదయం కన్ను మూశారు. ప్రస్తుతం ఆమె వయసు 73 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కమలాకుమారి కొండాపూర్లోని తన నివాసంలో ఈరోజు ఉదయం తుదిశ్వాసని విడిచారు.
రావు గోపాలరావు భార్యగానే కాక కమలాకుమారి ప్రముఖ హరికథా కళాకారిణిగా కూడా తెలుగు ప్రజలకి సుపరిచితం. కమలాకుమారి గొప్ప హరికథా కళాకారిణి. ఆమె 5000 లకు పైగా ప్రదర్శనలు వివిధ రాష్ట్రాల్లో ఇచ్చారు. కమలాకుమారి ఓ స్టేజి షో ఇస్తుండగా చూసిన రావు గోపాలరావు ఆమెను ప్రేమించి పెద్దలని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. రావు గోపాలరావు-కమలాకుమారి దంపతులకి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేయగా మెగాస్టార్ చిరంజీవి ఆమెకు నివాళులర్పించేందుకు రావు రమేష్ నివాసానికి బయలుదేరారు.