దేశ ప్రజలకు అభినందనలు

దేశ ప్రజలకు అభినందనలు

‘‘గొప్ప ఆరంభం.. ప్రతి ఒక్కరికి.. ముఖ్యంగా దేశ ప్రజలకు అభినందనలు. ఈ గెలుపు మీ ముఖాలపై చిరునవ్వులు పూసేందుకు.. పండుగ చేసుకునేందుకు కారణమవుతుందని ఆశిస్తున్నా. ఆ దేవుడి దయ వల్ల అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి… దేశాన్ని.. జాతిని తలెత్తుకునేలా చేశాం. అలాగే ముందుకు సాగుతాం. మీ ప్రార్థనలు, మద్దతు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి’’ అంటూ అఫ్గానిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ ఉద్వేగభరిత పోస్టు చేశాడు. తాలిబన్ల పాలనలో దేశంలో నెలకొన్న అనిశ్చితితో సతమవుతున్న ప్రజలకు తమ గెలుపు కాస్త ఊరట కలిగిస్తుందని పేర్కొన్నాడు.

కాగా టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్‌ సూపర్‌-12కు నేరుగా అర్హత సాధించిన సంగతి తెలిసిందే. గ్రూపు-2లో ఉన్న అఫ్గన్‌.. సోమవారం షార్జాలో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై ఘన విజయం సాధించింది. 130 పరుగుల తేడాతో గెలుపొంది టోర్నీలో శుభారంభం చేసింది. ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్, రషీద్‌ ఖాన్‌ స్పిన్‌ మాయాజాలంతో అద్వితీయి విజయాన్ని అందుకుంది.

ఈ నేపథ్యంలో దేశంలోని పరిస్థితులను తలచుకుని రషీద్‌ ఖాన్‌ భావోద్వేగానికి గురయ్యాడు‌. ప్రపంచ వేదికపై తాము సాధించిన విజయం దేశ ప్రజలకు గర్వకారణమంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. సోషల్‌ మీడియా వేదికగా తన భావాలను పంచుకున్నాడు. ఇదిలా ఉండగా.. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌ ఆరంభానికి ముందు తమ జాతీయ గీతం వినిపించగానే అఫ్గనిస్తాన్‌ కెప్టెన్‌ మహ్మద్‌ నబీ కన్నీటి పర్యంతమయ్యాడు. టీ20 వరల్డ్‌కప్‌ వరకు తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.