జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యాయస్థానాల్లో మౌలికవసతులపై తరుచూ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎదుటే చీఫ్ జస్టిస్ పలు అంశాలను లేవనెత్తారు. శనివారం మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయ మంత్రి కిరణ్ రిజుజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఏకరువు పెట్టిన ప్రధాన న్యాయమూర్తి.. వచ్చే శీతాకాల సమావేశాల్లో జాతీయ న్యాయ మౌలికసౌకర్యాల అథారిటీ బిల్లును ప్రతిపాదించాలని సూచించారు.

‘భారతదేశంలోని న్యాయస్థానాలకు న్యాయపరమైన అవస్థాపన అనేది ఎల్లప్పుడూ ఒక ఆలోచనగా ఉంటుంది.. ఈ మనస్తత్వం కారణంగానే దేశంలోని న్యాయస్థానాలు ఇప్పటికీ శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలతో పనిచేస్తాయి.. సమర్థవంతంగా పని చేయడం కష్టమవుతుంది.. కేవలం 5 శాతం కోర్టు కాంప్లెక్సుల్లో మాత్రమే వైద్య సౌకర్యాలున్నాయి.. 26 శాతం కోర్టుల్లో మహిళలకు ప్రత్యేకంగా టాయ్‌లెట్స్. 16 శాతం కోర్టుల్లో పురుషులకు టాయ్‌లెట్ సౌకర్యం లేదు.. దాదాపు 50 శాతం కోర్టు కాంప్లెక్సుల్లో లైబ్రరీలు, 46 శాతం కోర్టుల్లో స్వచ్ఛమైన తాగునీరు లేదు’ అన్నారు.

‘ఈ ప్రతిపాదనలను కేంద్ర న్యాయ మంత్రికి పంపాను.. త్వరలోనే సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నాను.. ప్రక్రియను కేంద్ర న్యాయ మంత్రి వేగవంతం చేస్తారని అనుకుంటున్నాను’ అని అన్నారు. కాగా, న్యాయశాఖ మంత్రితో వేదికను పంచుకునే సమయంలో ప్రధాన న్యాయమూర్తి న్యాయవ్యవస్థకు సంబంధించిన సమస్యలపై అభ్యర్థన చేయడం ఇది రెండోసారి. హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాల కోసం సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను ప్రభుత్వం నుంచి త్వరితగతిన ఆమోదం తెలపాలని గతంలో కోరారు.

బ్రిటిష్ పాలన అనంతరం న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం రాజ్యమేలిందంటూ గతంలో వ్యాఖ్యానించారు. జాతీయ జ్యుడీషియల్‌ ఇన్‌ఫ్రా కార్పొరేషన్‌ ఏర్పాటుతోనే ఈ సమస్యకు పరిష్కారమని సూచించారు. దేశీయ కోర్టుల్లో మెరుగైన వసతులు లేకపోవడం విచారకరమని, దీనివల్ల న్యాయసిబ్బంది పనితీరుపై ప్రభావం కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.