కారును దొంగిలించిన బిటెక్‌ విద్యార్థి

కారును దొంగిలించిన బిటెక్‌ విద్యార్థి

తను చూసిన ఒక సినిమా తరహాలో కారును దొంగిలించి తన ఫ్రెండ్స్‌తో జల్సాలు చేస్తున్న ఓ విద్యార్థిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన తుకారాంగేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ ఎల్లప్ప తెలిపిన మేరకు.. ఈస్ట్‌మారేడుపల్లిలోని సెయింట్‌ జాన్స్‌ చర్చి వెనుకవైపు ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో పార్క్‌ చేసి ఉన్న కారును ఈ నెల 9న అమీర్‌పేట్‌కు చెందిన రిత్విక్‌ అనే బిటెక్‌ విద్యార్థి దొంగిలించాడు.యజమాని డాక్టర్‌ పద్మావతి తుకారాంగేట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కాగా, వెహికిల్‌ చెకింగ్‌లో భాగంగా శుక్రవారం మహేంద్రాహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వద్ద కారులో వెళ్తున్న రిత్విక్‌ను పోలీసులు పట్టుకొని కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిత్విక్‌ను స్టేషన్‌కు తరలించి విచారించారు. అయితే ‘గాన్‌ ఇన్‌ సిక్స్‌టీ సెకన్స్‌’ సినిమా చూసి అందులో చేసిన విధంగా కారు దొంగిలించి స్నేహితులతో జల్సాలు చేసినట్లు అతను ఒప్పుకున్నాడు. దీంతో మెజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల పాటు జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు.