‘ఛలో’, ‘గీత గోవిందం’ సినిమాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న కన్నడ భామ రష్మిక మందన్నా. దక్షిణాదిన మిగతా స్టార్ హీరోయిన్లతో పోలిస్తే రష్మిక గ్లామర్ పరంగా వీకే. అయినా సరే అదృష్టం కలిసి రావడం వల్లో.. యాక్టింగ్ స్కిల్స్ వల్లో.. వరుస విజయాల వల్లో ఆమె స్టార్ స్టేటస్ సంపాదించింది. పెద్ద పెద్ద స్టార్ల సరసన అవకాశాలు అందుకుంటోంది.
ప్రస్తుతం మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’ చేస్తున్న ఆమె.. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో రాబోయే సినిమాలోనూ అవకాశం దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు తమిళంలోనూ రెండు మంచి అవకాశాలు సంపాదించింది రష్మిక. ఐతే ఈ అమ్మాయికి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, పొగరని, రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేస్తోందని.. ఇటీవల వరుసగా ఆరోపణలు వస్తుండటం గమనార్హం.
ఐతే పనిగట్టుకుని కొందరు దురుద్దేశంతో తన గురించి ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారంటూ రష్మిక ఈ ఆరోపణలన్నింటినీ ఖండించింది. అయినప్పటికీ ఇలాంటి ఊహాగానాలు ఆగట్లేదు. తాజాగా రష్మిక గురించి జరుగుతున్న ప్రచారం ఏంటంటే.. దిల్ రాజు నిర్మాణంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కాల్సిన ఓ సినిమాలో తనను కథానాయికగా ఖరారు చేయగా.. ఆమె చైతూ కంటే ఎక్కువ పారితోషకం డిమాండ్ చేసిందట. ఈ సినిమాను రాజు ఆపేశాడని.. అందుకు రష్మిక రెమ్యూనరేషన్ డిమాండ్ కూడా ఒక కారణమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఐతే ఈ సినిమా నిజంగా ఆగిందా లేదా అన్నది పక్కన పెడితే.. రష్మిక చైతూ కంటే ఎక్కువ పారితోషకం డిమాండ్ చేయడం అన్నది లాజికల్‌గా అనిపించడం లేదు. ‘మజిలీ’తో పెద్ద హిట్ కొట్టిన చైతూ ప్రస్తుతం రూ.4-5 కోట్ల మధ్య పారితోషకం తీసుకుంటున్నాడు. మరి రష్మిక అంతకుమించి రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందంటే విడ్డూరమే.