బహు భాషా చిత్రంలో నటించిన రష్మిక లవర్‌

బహు భాషా చిత్రంలో నటించిన రష్మిక లవర్‌

రక్షిత్ శెట్టి.. ఇతనో కన్నడ నటుడు, నిర్మాత. ఐతే సినిమాల పరంగా అతడితో మన వాళ్లకు ఎలాంటి పరిచయం లేదు. కానీ ఈ రక్షిత్ పేరు తెలుగు ప్రేక్షకుల నోళ్లలో బాగా నానింది. గత ఏడాది అతడు చాన్నాళ్ల పాటు వార్తల్లో ఉన్నాడు. అందుకు కారణమేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక మందన్నాకు కొన్ని నెలల కిందటి వరకు అతను ఫియాన్సీ.

రక్షిత్ హీరోగా నటిస్తూ నిర్మించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘కిరిక్ పార్టీ’తోనే రష్మిక కథానాయికగా పరిచయం అయింది. అప్పుడే వాళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వెంటనే ఇద్దరూ నిశ్చితార్థం కూడా చేసేసుకున్నారు. కానీ పెళ్లిని మాత్రం వాయిదా వేసుకున్నారు. ఐతే రెండేళ్లు సవ్యంగానే సాగిన వీరి ప్రేమాయణానికి కొన్ని నెలల కిందట బ్రేక్ పడిపోయింది.

కారణాలేంటో ఏమో కానీ.. రష్మిక రక్షిత్ నుంచి విడిపోయింది. రష్మిక లవర్‌గా దక్షిణాదిన బాగానే పాపులర్ అయిన రక్షిత్.. ఆ పాపులారిటీని నమ్ముకునే ఇప్పుడు ఓ బహు భాషా చిత్రంలో నటించినట్లున్నాడు. రక్షిత్ హీరోగా ‘అతడే శ్రీమన్నారాయణ’ అనే సినిమా తెరకెక్కింది. ఇందులో అతను పోలీస్ పాత్రలో నటించాడు. సచిన్ అనే దర్శకుడు ఈ సినిమాను రూపొందించాడు.

‘అతడే శ్రీమన్నారాయణ’ను కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తుండటం విశేషం. రష్మిక మాజీ లవర్ అన్న గుర్తింపు తప్పితే కర్ణాటక అవతల రక్షిత్‌కు నటుడిగా ఏమీ పేరు లేదు. ఇలాంటి హీరో నటించిన సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ చేయడం విడ్డూరమే. బహుశా ‘కేజీఎఫ్’ సాధించిన సంచలన విజయం తర్వాత కన్నడ సినిమాల మేకర్స్‌కు ఆశ పెరిగినట్లుంది. సుదీప్ లాంటి పేరున్న నటుడు చేసిన ‘పహిల్వాన్’ సినిమానే జనాలు పట్టించుకోనపుడు.. రక్షిత్ సినిమాను ఏం చేస్తారో చూడాలి. ఈ చిత్రం డిసెంబరు 27న విడుదల కానుంది.