Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలు పూర్తిచేసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత క్రికెట్లో సచిన్ స్థాయికి ఎదగగల ఆటగాడిగా కోహ్లీపై ఉన్న అంచనాలు సరైనవే అని ఈడెన్ గార్డెన్స్ లో చేసిన సెంచరీ నిరూపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కోహ్లీ మహత్తరమైన ఆటగాడని, అతనికి ఆకాశమే హద్దని, అతణ్ని చూస్తే చాలా సంతోషంగా ఉందని కోచ్ రవిశాస్త్రి ప్రశంసించాడు. విరాట్ కోహ్లీ మరో అద్భుతమైన శతకం సాధించాడని, అతను మంచి కెప్టెన్ అని, ఎంతో భవిష్యత్ ఉన్న ఆటగాడని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పొగిడాడు. ఆటగాడిగా టీమిండియాలో స్థానం సంపాదించిన దగ్గరనుంచి కోహ్లీ వెనుతిరిగి చూసుకోలేదు.
అంతకుముందు కొన్ని మ్యాచ్ లు ఆడినప్పటికీ… 2011 ప్రపంచకప్ లో చేసిన సెంచరీతో భారత క్రికెట్లో కోహ్లీ శకం మొదలయిందని చెప్పవచ్చు. తొలి ప్రపంచకప్ లోనే సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన కోహ్లీ… తర్వాత శరవేగంగా ఎదిగాడు. తనకు పోటీగా ఉన్న సురేశ్ రైనా, రోహిత్ శర్మ వంటివారిని దాటుకుని విశేష ప్రతిభ చూపించి… తొలుత టెస్ట్ కెప్టెన్సీని, తర్వాత వన్డే కెప్టెన్సీని సొంతం చేసుకున్నాడు. సాధారణంగా ఎంత గొప్ప ఆటగాడయినా కెప్టెన్ అయిన తరువాత అతని ఆట తీరుపై ప్రభావం పడుతుంది. కానీ కోహ్లీ దీనికి భిన్నం. కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా కోహ్లీ బ్యాటింగ్ లో విశేష ప్రతిభ చూపుతున్నాడు. సచిన్ తన కెరీర్ లో వంద శతకాలు సాధిస్తే… అందులో సగం శతకాలను కోహ్లీ ఇప్పటికే పూర్తిచేశాడు. అద్భుత ఫామ్ లో ఉన్న కోహ్లీ సచిన్ సెంచరీల రికార్డును అధిగమించడంతో పాటు… అంతర్జాతీయ క్రికెట్ లో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాడని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.