కరోనా విశ్వరూపం.. లాక్ డౌన్ వేళ.. రిజర్వు బ్యాంక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ లోన్ తీసుకున్న వారికి ఎలక్ట్రానిక్ కార్డు జారీ చేయ వచ్చని బ్యాంకులకు స్పష్టం చేసింది. దీంతో బ్యాంక్ అకౌంట్ లేకపోయినా కూడా కార్డు పొందవచ్చు. గతంలో అకౌంట్ ఉంటేనే కార్డులు జారీ చేసేవారు. అయితే బ్యాంక్ నుంచి డెబిట్ కార్డు పొందాలంటే కచ్చితంగా ఆ బ్యాంక్లో అకౌంట్ ఉండాలి. సేవింగ్స్ ఖాతా లేదంటే కరెంట్ అకౌంట్ కలిగి ఉంటే సరిపోతుంది. కానీ.. ఇప్పుడు బ్యాంక్లో అకౌంట్ లేకపోయినా కూడా డెబిట్ కార్డు పొందొచ్చు. అయితే అందుకు సంబంధించి పర్సనల్ లోన్ తీసుకొని ఉండాలి. అంటే బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఉంటే మీకు ఎలక్ట్రానిక్ కార్డు రానుంది.
కాగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా నిబంధలను కొన్ని సడలించింది. ఇందులో భాగంగా బ్యాంకులు పర్సనల్ లోన్ తీసుకున్న వారికి కూడా ఎలక్ట్రానిక్ కార్డులు జారీ చేయవచ్చని తెలిపింది. ఓవర్డ్రాఫ్ట్ అకౌంట్ కలిగిన వారికి ఎలక్ట్రానిక్ కార్డుల జారీకి ఆర్బీఐ తాజాగా అంగీకారం తెలపడం విశేషం. ఇది పర్సనల్ లోన్ తీసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. పర్సనల్ లోన్ కలిగిన వారికి ఎలక్ట్రానిక్ కార్డులు జారీ చేస్తారు. బ్యాంక్ లోన్ గడువు వరకు ఈ కార్డులకు కూడా వాలిడిటీ ఉంటుంది. తర్వాత ఉండదు. కార్డుల జారీ అనేది బ్యాంకుల ఇష్టమని కూడా తెలిపింది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రానిక్ కార్డులను కేవలం దేశీ లావాదేవీలకు మాత్రమే వినియోగించాలి. అలాగే ఈ కార్డుల ద్వారా ఆన్లైన్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్లను మాత్రమే నిర్వహించగలం. అంటే ఎలాంటి నగదు లావాదేవీలకు ఈ కార్డు ఉపయోగపడదని ఆర్బీఐ తెలిపింది. కాగా రిస్క్ మేనేజ్మెంట్, ఆ లోన్ క్రమం చెల్లింపులపై సమీక్ష, ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలన్నింటినీ లెక్కించిన తర్వాతే ఎలక్ట్రానిక్ కార్డులను జారీ చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.