Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాష్ట్రాల్లో బిత్తిరి సత్తి గురించి తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా తెలంగాణలో బిత్తిరి సత్తికి విపరీతమైన క్రేజ్ ఉంది. బుల్లి తెరపై ఇటీవల తెగ సందడి చేస్తోన్న బిత్తిరి సత్తి తెలంగాణ భాషలో మాట్లాడుతూ చేసే కామెడీ అంతా ఇంతా కాదు. కొన్ని రియాల్టీ షోల్లో కూడా బిత్తిరి సత్తి ఇటీవల పాల్గొంటున్నాడు. తీన్మార్ వార్తల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ చేవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తిపై తాజాగా దాడి జరిగింది.
మణికంఠ అనే వ్యక్తి బిత్తిరి సత్తిని గాయ పడేలా కొట్టాడు. వి6 ఆఫీస్‌కు కూత వేటు దూరంలో ఈ దాడి జరిగింది. బిత్తిరి సత్తి వెంట ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా మణికంఠ నుండి అతడిని కాపాడలేక పోయారు. రోడ్డు పక్కన ఏదో పనిలో ఉన్న బిత్తిరి సత్తిని బైక్‌పై హెల్మెట్ పెట్టుకుని వచ్చిన వ్యక్తి కొట్టి పారిపోయాడు. గాయాలైన సత్తిని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వ్యక్తి తానే దాడి చేసినట్లుగా ఒప్పుకున్నాడు. తెలంగాణ భాష పరువు తీస్తున్నాడనే కోపంతోనే తాను దాడి చేశాను అంటూ మణికంఠ చెప్పుకొచ్చాడు.
తాను తిక్కలి వాడిని కాదని, జర్నలిజంలో డిగ్రీ చేసి, సినిమాలకు రచయితగా చేస్తున్న వాడిని, త్వరలోనే ఒక సినిమాకు దర్శకత్వం కూడా చేయబోతున్నాను అంటూ మణికంఠ చెప్పుకొచ్చాడు. భాషను కామెడీ చేస్తూ తెలంగాణ పరువు తీస్తున్నాడు అనే ఉద్దేశ్యంతోనే తాను సత్తిని కొట్టాను అన్నాడు. చాలా రోజులుగా సత్తిపై దాడి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాను. ఇన్నాళ్లకు ఆ అవకాశం కలిగిందని ఆయన అన్నాడు.