Posted [relativedate] at-[relativetime time_format=”H:i”]
చాలా సంవత్సరాలుగా రజినీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అంటూ తమిళనాట ప్రచారం జరుగుతూ వస్తుంది. రజినీకాంత్ అభిమానులు తమ అభిమాన హీరో వస్తున్నాడు అంటూ ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు రజినీకాంత్ తన రాజకీయ ఎంట్రీని వాయిదా వేస్తూ ప్రేక్షకులను నీరుగార్చుతూ వచ్చాడు. తాజాగా రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాడు. అభిమానులకు కూడా ఆ విషయాన్ని చెప్పాడు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత అక్కడ రాజకీయ అనిశ్చితి ఏర్పడినదని, ఈ సమయంలో పార్టీ పెట్టడం వల్ల లాభం చేకూరే అవకాశం ఉందని రజినీకాంత్ భావించి పార్టీ ఏర్పాటుకు సిద్దం అయ్యాడు.
ఇటీవలే కమల్ హాసన్ తాను కూడా రాజకీయ అరంగేట్రం చేస్తాను అంటూ ప్రకటించాడు. ఇప్పటికే కమల్ రాజకీయంగా పావులు కదుపుతూనే ఉన్నాడు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలపై రాజకీయ నాయకుడి తరహాలో కమల్ విమర్శలు చేస్తూ ప్రజల్లోకి దూసుకు పోతున్నాడు. కమల్ మరి కొన్ని రోజుల్లో పార్టీని ప్రకటించడం ఖాయంగా తెలుస్తోంది. 2019 పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో కమల్ పార్టీ పోటీకి దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కమల్, రజినీకాంత్‌ు పోటీ పడే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో రజినీకాంత్ పార్టీ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ ఏర్పాటుకు ఇంకాస్త సమయం తీసుకోవాలని రజినీకాంత్ భావిస్తున్నాడు. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు ముగించి ఆ తర్వాత పార్టీ గురించి మరోసారి అభిమానులతో చర్చిస్తాను అంటూ రజినీకాంత్ ప్రకటించడంతో ఆయన అభిమానులే నిరాశ చెందుతున్నారు.
సినిమా పరిశ్రమకు చెందిన ఇద్దరు ప్రముఖులు రాజకీయ పార్టీ పెట్టడం వల్ల ఉపయోగం ఉండదని, కమల్‌తో ఢీ కొట్టడం వల్ల లాభం జరగక పోగా నష్టం ఎక్కువ అవుతుందని రజినీకాంత్ భావిస్తున్నాడు. అందుకే పార్టీ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. భవిష్యత్తులో కమల్ పార్టీ, కమల్ పని తీరును బట్టి రజినీకాంత్ రాజకీయ పార్టీ ఆధారపడి ఉంటుంది. ప్రజల్లో కమల్ పార్టీకి ఆధరణ దక్కితే రజినీకాంత్ రాజకీయ పార్టీ గురించి మర్చి పోయే అవకాశం ఉందని తమిళనాట రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.