జనసేన పార్టీ ఏర్పాటు చేసి దగ్గర దగ్గర నాలుగేళ్ళు అవుతున్నా సరైన నిర్వహణ కమిటీలు కూడా లేకుండా పార్టీకి అన్నీ తానై నడిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు పలికిన పవన్ కల్యాణ్ గుంటూరులో జరిగిన తమ పార్టీ ఆవిర్భావ సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేసి అటు చంద్రబాబు, లోకేష్ లపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కలకలం రేపాడు. అప్పటి నుంచి ప్రభుత్వంపై పోరాటం చేస్తానని చెప్పిన జనసేనాని… ప్రజా పోరాట యాత్ర పేరుతో రాష్ట్రంలో తిరుగుతానని ప్రకటించాడు. చెప్పినట్లుగానే యాత్రను ప్రారంభించిన పవన్… ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటించాడు. అయితే కొద్దిరోజుల క్రితం పోరాట యాత్రకు విరామం ప్రకటించాడు జనసేనాని.
పవన్ వ్యక్తిగత సిబ్బందిలో ఎక్కవ శాతం ముస్లింలు ఉన్నారని, రంజాన్ పండుగను దృష్టిలో పెట్టుకుని యాత్రకు కొన్ని రోజులు విరామం తీసుకుంటున్నట్లు పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటనను విడుదల చేశారు. అయితే, పవన్ యాత్రకు విరామం ప్రకటించడం వెనుకు వేరే కారణం ఉందని ప్రచారం జరుగుతోంది. యాత్రలో పవన్ కీ అతని సిబ్బందికీ అవసరమైనవి సమకూర్చడానికి చాలా ఖర్చు అయిందట. ఆ బిల్లులు చూసిన పవన్ షాక్ అయ్యాడట. ఇంత మొత్తం ఖర్చులయితే భరించడం కష్టమని ఎక్కడికి వెళ్లినా అనుకున్న దాని కంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందని సన్నిహితులతో వాపోయాడట పవన్. ఈ ఖర్చును భరించడం కష్టమని భావించిన పవన్ యాత్రకు బ్రేక్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. అందుకే జనసేనకు ఫండ్స్ ఇచ్చే వారి కోసం అన్వేషించమని పార్టీ నాయకులకు చెప్పి జనసేన డొనేషన్స్ స్టార్ట్ చేసారని తెలుస్తోంది. మరో కారణంగా పవన్ కి ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు అని కూడా అని అంటున్నారు. ఏదీ ఏమైనా… పవన్ తన పాదయాత్ర విషయంలో లేని పారదర్శకత జనసేన శ్రేణులకి ఇబ్బందే.