శ్రీదేవి అస్థిక‌లు హ‌రిద్వార్ లో క‌లిపిన కార‌ణ‌మిదే….

Reason Behind why Boney Kapoor immersed Sridevi ashes in Haridwar

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దివంగ‌త న‌టి శ్రీదేవి అస్థిక‌ల‌ను ముందు రామేశ్వ‌రంలోనూ, త‌ర్వాత హ‌రిద్వార్ లోనూ నిమ‌జ్జ‌నం చేశారు. ఇలా రెండు చోట్ల నిమ‌జ్జ‌నం చేయ‌డం ఎందుకని అంద‌రికీ సందేహం క‌లిగింది. దీనిపై శ్రీదేవి భ‌ర్త బోనీక‌పూర్ స‌న్నిహితులు మీడియాకు వివ‌ర‌ణ ఇచ్చారు. శ్రీదేవి తెలుగు,త‌మిళ కుటుంబానికి చెందిన మ‌హిళ కావ‌డంతో ద‌క్షిణ భార‌త‌దేశ హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం ఆమె అస్థిక‌ల‌ను ముందుగా రామేశ్వ‌రంలో నిమ‌జ్జ‌నం చేశారు. బోనీక‌పూర్ తో పాటు కుమార్తెలు జాన్వీ, ఖుషీ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అనంత‌రం హ‌రిద్వార్ లోనూ శ్రీదేవి అస్థిక‌ల‌ను బోనీక‌పూర్ నిమ‌జ్జ‌నం చేశారు. బోనీ త‌మ్ముడు అనీల్ క‌పూర్, క‌ర‌ణ్ జోహార్, శ్రీదేవి స్నేహితుడు, ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. హ‌రిద్వార్ లో అస్థిక‌లు క‌ల‌ప‌డానికి కార‌ణం శ్రీదేవికి ఉన్న ఓ మొక్కే.

1993లో శ్రీదేవి ఓ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా హ‌రిద్వార్ వెళ్లారు. అయితే షూటింగ్ లో బిజీగా ఉండ‌డంతో ఆమె హ‌రిద్వార్ ను ద‌ర్శించుకోలేక‌పోయారు. దాంతో మ‌ళ్లీ వ‌స్తాన‌ని మొక్కుకున్నారు. కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ హ‌రిద్వార్ వెళ్ల‌డం శ్రీదేవికి కుద‌ర‌లేదు. అందుకే శ్రీదేవి కోరిక ప్ర‌కారం ఆమె అస్థిక‌ల‌ను హ‌రిద్వార్ లోని గంగా న‌దిలో క‌లిపిన‌ట్టు కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. హ‌రిద్వార్ లో పిండ‌ప్రదానం చేస్తున్న స‌మ‌యంలో బోనీక‌పూర్ క‌న్నీరుమున్నీర‌య్యారు. భార్య చ‌నిపోయిన బాధ నుంచి బోనీక‌పూర్ కోలుకోలేక‌పోతున్నారు. శ్రీదేవి జ్ఞాప‌కాలు త‌లుచుకుని భోరున విల‌పిస్తున్నారు. బోనీని ప‌రామ‌ర్శించ‌డానికి వ‌చ్చిన వారంతా శ్రీదేవి మ‌ర‌ణాన్ని ఆయ‌న త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని… చాలా కుమిలిపోతున్నార‌ని చెబుతున్నారు. తాజాగా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త అనీల్ అంబానీ స‌తీమ‌ణి టీనా అంబానీ బోనీక‌పూర్ ఇంటికి వెళ్లిన‌ప్పుడు కూడా బోనీ దుఃఖాన్ని ఆపుకోలేక‌పోయారు. టీనా బోనీకి ఓ కానుక తీసుకువెళ్లారు. ఫిబ్ర‌వ‌రి 11న టీనా త‌న 61వ పుట్టిన‌రోజు వేడుక‌ను ముంబైలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు శ్రీదేవి, బోనీక‌పూర్ తో పాటు పలువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా టీనా… శ్రీదేవితో క‌లిసి దిగిన ఓ ఫొటోను వెండి ఫ్రేమ్ తో డిజైన్ చేయించి బోనీకి కానుక‌గా ఇచ్చారు. ఆ ఫొటో చూసి బోనీ ఉద్వేగానికి లోన‌య్యారు. ఇదే శ్రీదేవితో క‌లిసి దిగిన ఆఖ‌రి ఫొటో అవుతుంద‌ని అనుకోలేద‌ని టీనా కూడా బాధ‌ప‌డ్డారు.

అటు తల్లి చ‌నిపోయిన బాధ‌ను దిగ‌మింగుకుని శ్రీదేవి పెద్ద‌కుమార్తె జాన్వి ధ‌డ‌క్ సినిమా షూటింగ్ కు వ‌చ్చింది. శ్రీదేవి హ‌ఠాన్మ‌రణంతో షాక్ కు గుర‌యిన జాన్వి కొన్ని రోజులు షూటింగ్ కు హాజ‌రు కాలేదు. గురువారం తిరిగి షూటింగ్ లో జాయిన‌యింది. ఈ సంద‌ర్భంగా తీసిన ఫొటోల‌ను విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ జాన్వి అంకిత‌భావాన్ని మెచ్చుకుంది. ఫొటోల్లో జాన్వి సంప్ర‌దాయబ‌ద్ధంగా క‌నిపిస్తోంది. ప‌చ్చ‌రంగు చీర‌లో పెద్ద బొట్టుతో త‌ల్లిని గుర్తుకుతెస్తోంది. ముందుగా అనుకున్న తేదీ ప్ర‌కార‌మే జులై 6న ధ‌డ‌క్ రిలీజ్ చేయనున్నారు. మ‌రాఠీలో అద్భుత విజ‌యం సాధించిన సైరాత్ కు హిందీ రీమేక్ గా వ‌స్తోన్న ధ‌డ‌క్ లో షాహిద్ క‌పూర్ త‌మ్ముడు ఇషాన్ ఖ‌త్త‌ర్ హీరోగా న‌టిస్తున్నాడు. బాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్ర షూటింగ్ బాంద్రాలో జరుగుతోంది. ఇక్క‌డ కొన్నిరోజుల షూటింగ్ అనంత‌రం మిగిలిన చిత్రీక‌ర‌ణ కోసం యూనిట్ స‌భ్యులు కోల్ క‌తాకు వెళ్ల‌నున్నారు.