సాయంత్రం 6 గంట‌ల‌కు స్పీక‌ర్‌ను క‌ల‌వండి..

rebal mlas to resign in person by 6 pm

క‌ర్నాట‌క రెబ‌ల్ ఎమ్మెల్యేలు త‌మ రాజీనామాల‌ను ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీక‌ర్‌కు స‌మ‌ర్పించుకోవాల‌ని ఇవాళ సుప్రీంకోర్టు త‌న తీర్పులో స్ప‌ష్టం చేసింది. ఇవాళ సాయంత్రం ఆరు గంట‌ల‌కు రెబ‌ల్ ఎమ్మెల్యేలు స్పీక‌ర్‌ను క‌లుసుకోవాల‌ని కోర్టు ఆదేశించింది. జేడీఎస్‌-కాంగ్రెస్ కూట‌మికి చెందిన ప‌ది మంది రెబ‌ల్ ఎమ్మెల్యేలు కావాలంటే రాజీనామాలు స‌మ‌ర్పించుకోవ‌చ్చు అని కోర్టు చెప్పింది. రాజీనామాను స్పీక‌ర్‌కు ఇవ్వాల‌నుకుంటున్న ఎమ్మెల్యేల‌కు పోలీసులు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేల భ‌ద్ర‌త‌కు సంబంధించి డీజీపీకి ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఈ కేసును జూలై 12వ తేదీకి వాయిదా వేసింది. రెబల్ ఎమ్మెల్యేల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ, ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ సభ్యత్వాలకు రాజీనామా చేసి తాజా ఎన్నికలను కోరుతున్నారని చెప్పారు. స్పీకర్ పక్షపాత ధోరణితో, దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారన్నారు. మైనారిటీలో పడ్డ ప్రభుత్వాన్ని స్పీకర్ కాపాడుతున్నారని రెబల్స్ ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశం మేరకు అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ముంబైకి వచ్చిన ఆ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ తన ప్రయత్నాలలో విఫలమయ్యారు. పది మంది రెబల్ ఎమ్మెల్యేలు మకాం వేసిన హోటల్ ముందు శివకుమార్, ముంబై కాంగ్రెస్ నేతలు మిలింద్ దేవరా, సంజయ్ నిరుపమ్, జేడీఎస్ నేతలు జీటీ దేవెగౌడ, శివలింగ గౌడ, సీఎన్ బాలకృష్ణన్ తదితరులు దాదాపు ఐదు గంటల పాటు బైఠాయించారు.