నాలుగు జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్

నాలుగు జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్

వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలో నదులు, చెరువులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు నీటమునగడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రహదారులపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో అనేక మార్గాల్లో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు జారీచేసింది.

మంగ‌ళ‌వారం ఐదు జిల్లాల‌కు, బుధ‌వారం నాలుగు జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. పెద్దప‌ల్లి, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ములుగు, భ‌ద్రాద్రి కొత్తగూడెం, ఖ‌మ్మం జిల్లాల్లో మంగ‌ళ‌వారం భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. బుధ‌వారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరించింది. ఈ రెండ్రోజులు మిగ‌తా జిల్లాల్లో పాటు మోస్తరు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ శాఖ పేర్కొంది.

హైదరాాబాద్ నగరంలోనూ 3-4 రోజులుగా వర్షం కురుస్తూనే ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మరోవైపు సోమవారం ఉమ్మడి ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాలు, కాలనీలు నీట మునిగాయి. వ‌ర్షాల ప‌ట్ల అప్రమ‌త్తంగా ఉన్న అధికారులు ఎప్పటిక‌ప్పుడు స‌హాయ‌క చ‌ర్యలు చేప‌ట్టి ప‌లువురిని ర‌క్షించారు. ఉత్తర, మ‌ధ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవ‌ర్తన ప్రభావంతో వాయువ్య, తూర్పు మ‌ధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.