నటిగా కాదు… దర్శకురాలిగా!

Renu Desai Re-entry with movie industry as Director

పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ త్వరలో రెండవ పెళ్లికి సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. రెండవ పెళ్లి కారణంగా గత కొన్ని రోజులుగా మీడియాలో ఉంటూ వస్తున్న రేణుదేశాయ్‌ ఈసారి కొత్తగా సినిమాల కారణంగా మీడియాలో వార్తగా నిలిచింది. కొన్ని రోజులుగా తెలుగు సినిమాల్లోకి రేణుదేశాయ్‌ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. తెలుగులో ఈమె నటిగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో అంతా కూడా ఆసక్తిగా ఉన్నారు అంటూ ప్రచారం జరిగింది. తాజాగా తన సినీ రీ ఎంట్రీ గురించి మీడియాలో వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. తెలుగు సినిమాల్లో రీ ఎంట్రీ విషయం నిజమే కాని, తాను రీ ఎంట్రీ ఇచ్చేది నటిగా కాదు అని, దర్శకురాలిగా అంటూ చెప్పుకొచ్చింది.

విడాకులు తీసుకున్న తర్వాత రేణుదేశాయ్‌ పుణె వెళ్లి పోయింది. కొన్నాళ్ల తర్వాత మరాఠ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఒక చిత్రానికి స్వయంగా దర్శకత్వం వహించింది. రెండు సినిమాలతో మరాఠ ప్రేక్షకులను పలకరించిన రేణుదేశాయ్‌ మళ్లీ సినిమాలకు బ్రేక్‌ వేసింది. ఇప్పుడు తెలుగులో దర్శకురాలిగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఈమె ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో కొత్త వారితో ఒక చిత్రాన్ని చేసేందుకు కథను సిద్దం చేశాను, స్క్రీన్‌ప్లే కూడా రెడీ అయ్యింది. ప్రస్తుతం డైలాగ్‌ వర్షన్‌ రాస్తున్నాను. మరో మూడు నెలల్లో అది పూర్తి చేస్తాను. సంక్రాంతికి తన తెలుగు సినిమా మొదలు కాబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఆ సినిమాలో తాను కనిపించబోను అని, కేవలం దర్శకత్వం మాత్రమే చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. తెలుగులో ఇప్పటి వరకు పలువురు దర్శకురాళ్లు పరిచయం అయ్యారు. కాని ఏ ఒక్కరు కూడా నిలదొక్కుకోలేక పోయారు. మరి రేణుదేశాయ్‌ అయినా తెలుగులో దర్శకురాలిగా నిలదొక్కుకుంటుందా అనేది చూడాలి.