తెర‌పైకి కొత్త‌స్నేహితులు

republican TV says YSRCP and BJP will alliance

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇన్నాళ్ళూ తెర వెన‌క దోబూచులాడిన స్నేహం ఇప్పుడు ముసుగు తొలగించి ముందుకు వ‌స్తోందా..?  రాజకీయ స్వ‌ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా రెండు పార్టీలు క‌లిసి న‌డిచేందుకు వేదిక  సిద్ధ‌మ‌యిందా… కొత్త నేస్తాలు… కొత్త అడుగులు మొద‌లు పెడుతున్నాయా… ఇక సార్వత్రిక ఎన్నిక‌ల దాకా ఇదే స్థితి కొన‌సాగ‌నుందా…? అవును ఈ ప్ర‌శ్న‌ల‌న్నీ కొత్త మిత్రులు బీజేపీ వైసీపీ గురించే… బీజేపీతో చెలిమిని పెంచుకునేందుకు త‌హ‌త‌హలాడిన జ‌గ‌న్‌…మొత్తానికి త‌న కోరిక తీర్చేసుకున్నారు. ఒక‌ప్పుడు అపాయింట్ మెంట్ ఇవ్వ‌టానికే నిరాక‌రించిన ప్ర‌ధానితో భేటీ అయి మ‌న‌సులో మాట చెప్పుకున్నారు. ఇక ఆ త‌ర్వాత‌… రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో అడ‌గ‌కుండానే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు స్వ‌ర్ణ‌యుగం తెస్తానంటూ న‌వ‌రత్నాలను ప్ర‌క‌టించారు కానీ… ప్ర‌త్యేక హోదాపై కేంద్రం చిన్న‌చూపు ఎందుకు చూస్తోందో నోరు తెరిచి ఒక్క‌సార‌న్నా అడిగిన పాపాన పోలేదు. ఇవన్నీ చూస్తున్న‌ప్పుడే  అంద‌రికీ అర్ధ‌మ‌యింది. బీజేపీ వైసీపీ మ‌ధ్య చెలిమి మొద‌ల‌యింద‌ని.

ఇన్నాళ్లూ తెర‌చాటునే త‌మ బంధాన్ని సాగించిన కొత్త స్నేహితులు  మ‌రికొన్ని రోజుల్లో ప్ర‌జ‌ల ముందుకు రానున్నారు. ఏ రూపంలోనో తెలుసా… ఏదో ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీచేయ‌టం ద్వారా కాదు… అధికారాన్ని పంచుకోవ‌టం ద్వారా… అవును వైసీపీ ఎన్డీయేలో చేర‌టానికి స‌ర్వం సిద్ధ‌మైంది. ఈ మాట‌లు చెప్పింది ఏదో పేరుతెలియ‌ని వెబ్ సైటో… మ‌రేదో అన‌ధికార‌క వార్తా సంస్థో కాదు… సాక్షాత్తూ… మోడీ మౌత్ వాయిస్ గా భావించే రిప‌బ్లిక్ టీవీ. జ‌గ‌న్ బీజేపీతో చేతులు క‌లిపేందుకు అంతా సిద్ద‌మ‌యింద‌ని, ముగ్గురు  బీజేపీ నేత‌ల‌తో ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ రిప‌బ్లిక్ టీవీ ఓ క‌థ‌నం ప్ర‌సారం చేసింది.

ఇంత‌కూ జ‌గ‌న్ కు, బీజేపీ నేత‌ల‌కూ మ‌ధ్య‌వ‌ర్తిత్త్వం న‌డుపుతున్నది ఎవ‌రో తెలుసా…?  మైనింగ్ మాఫియా కింగ్ గాలి జ‌నార్ద‌న రెడ్డి. ఆయనే జ‌గ‌న్ ను బీజేపీకి ద‌గ్గ‌ర చేస్తున్నారు. జ‌గ‌న్ కంటే బీజేపీతో క‌లిస్తే వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలున్నాయి. ముఖ్యంగా అవినీతి కేసుల నుంచి విముక్తి పొంద‌వ‌చ్చ‌ని జ‌గ‌న్ ఆలోచ‌న‌. మ‌రి ఇప్ప‌టికే రాష్ట్రంలో టీడీపీతో పొత్తుపెట్టుకుని… ఇక్క‌డ అధికారం అనుభ‌విస్తూ… ఎన్డీఏలోనూ టీడీపీని భాగ‌స్వామిని చేసుకున్న బీజేపీకి అవినీతి మ‌కిలి అంటింద‌ని ఒక‌ప్పుడు ప‌క్క‌న పెట్టిన జ‌గ‌న్ తో అంట‌కాగాల‌నే ఆలోచ‌న ఎందుకు వ‌చ్చింది అన్న‌ది అంద‌రిలోనూ త‌లెత్తుతున్న సందేహం. 2019 ఎన్నిక‌ల‌కోసం ఇప్ప‌టినుంచే స‌మాయ‌త్త‌మ‌వుతున్న బీజేపీ ఏపీలో మ‌రిన్ని ఎక్కువ సీట్లు, ఓట్లు సాధించేందుకు వైసీపీ వెంట న‌డ‌వాల‌ని భావిస్తోందని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఈ పొత్తును వ్యతిరేకిస్తున్నందుకే వెంక‌య్య‌నాయుణ్ని ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పించి ఉప‌రాష్ట‌ప‌తిని చేశార‌న్న వార్త‌లూ వ‌చ్చాయి. 

తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి బీజేపీ స్ప‌ష్ట‌మైన రాజ‌కీయ ల‌క్ష్యాలు నిర్దేశించుకుంద‌ని, త‌మ‌ది రాజ‌కీయ పార్టీ అని, రాజ‌కీయ లాభ‌న‌ష్టాల‌కే ప్రాధాన్యం ఇస్తామ‌ని, చంద్ర‌బాబుతో లాభ‌మ‌నుకుంటే ఆయ‌న‌తో ఉంటాం… లేదంటే వేరే నిర్ణ‌యం తీసుకుంటాం అని బీజేపీ సీనియ‌ర్ నేత ఒకరు ఆఫ్ ద రికార్డు తేల్చిచెప్పారు.  ఇది జ‌రిగిన మ‌రుస‌టి రోజే రిప‌బ్లిక్ టీవీలో ఈ వార్త రావ‌టం గ‌మ‌నార్హం. తమ లాభ‌న‌ష్టాల‌ను రాజ‌కీయ పార్టీలు చూసుకోవ‌టంలో త‌ప్పులేదు. కానీ 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు అవినీతి ర‌హిత ప్ర‌భుత్వం అన్న నినాదంతో ముందుకు వెళ్లాల‌ని భావిస్తున్న మోడీ, అమిత్ షాలు అత్యంత తీవ్ర‌మైన అవినీతి ఆరోప‌ణ‌ల్లో చిక్కుకుని కేసులు కూడా ఎదుర్కొని జైలు జీవితం గ‌డిపిన జ‌గ‌న్ ను ఎలా క‌లుపుకుపోవాల‌నుకుంటున్నారో అర్ధం కావ‌టం లేద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు.

 మరిన్ని వార్తలు:

టార్గెట్ సీఎం కుర్చీ… పార్టీ ఏదైనా ఓకే.

డామేజ్ కంట్రోల్ పనిలో డీఎస్.

అర్జున్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ లీడర్‌ సీరియస్‌