కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలు ఈ వైరస్‌పై చాలా వేగంగా పరిశోధనలు జరుపుతున్నాయి. దీంతో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) చేసిన పరిశోధనలో ఓ కీలక రహస్యం తెలిసింది. భారత్‌లో నివసించే గబ్బిలాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు స్పష్టం చేసింది. భారత్‌లో వైద్య పరిశోధనలకు సంబంధించిన జర్నల్‌లో (Indian Journal of Medical Research) దీనిపై రాసిన ఓ స్టోరీలో వెల్లడించింది. పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)తో కలిసి ఐసీఎంఆర్ నిర్వహించిన పరిశోధనలో చాలా ఆసక్తికర వివరాలు వెల్లడైనట్లు ఆ స్టోరీలో పేర్కొనడం విశేషం.
అంతేకాకుండా భారత్‌లో నివసించే రెండు రకాల గబ్బిలాల్లో కరోనా వైరస్‌ను గుర్తించారని అన్నారు. రౌసెటస్, టెరోపస్ అనే రెండు రకాలకు చెందిన గబ్బిలాల్లో ఈ వైరస్‌ను గుర్తించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. టెరోపస్ గబ్బిలాలను ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ అని కూడా వ్యవహరిస్తారు. 2018, 2019లో ఈ గబ్బిలాలతోనే కేరళలో నిఫా వైరస్ వ్యాపించిన విషయం తెలిసిందే. నిఫా వైరస్ కారణంగా కేరళలో 17మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వీటిలో కరోనా వైరస్‌ను గుర్తించడం ఇదే తొలిసారి.
కాగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఒడిశా, చండీగఢ్, పుదుచ్చేరిల్లోని అడవుల్లో నివసించే పలు రకాల గబ్బిలాలపై ఈ పరిశోధన నిర్వహించినట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్త డాక్టర్ ప్రగ్యా యాదవ్ తెలిపారు. మొత్తం 25 గబ్బిలాలకు సంబంధించిన నమూనాలను సేకరించి పరిశోధన నిర్వహించినట్లు ఆమె వివరించారు. అయితే.. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో కనిపించే రెండు జాతులకు చెంది గబ్బిలాల్లోనే కరోనా వైరస్ జాడ కనిపించినట్లు అన్నారు. తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల నుంచి సేకరించిన నమూనాల్లో ఈ వైరస్ కనిపించలేదు.
కాగా ఈ గబ్బిలాల్లో గుర్తించిన వైరస్‌తో ప్రస్తుతం కరోనా మహమ్మారికి కారణమైన ‘SARS-CoV2’ వైరస్‌కు ఎలాంటి సంబంధం లేదని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ రకం కరోనా వైరస్ వల్ల మానవుల్లో ఇన్‌ఫెక్షన్లు కలుగుతాయని చెప్పడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవని ప్రగ్యా యాదవ్ తెలిపారు. వాస్తవానికి ఇప్పటివరకు 6 రకాల కరోనా వైరస్‌లను గుర్తించారు. తొలిసారిగా ఈ వైరస్‌ను 1960లోనే గుర్తించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న కోవిడ్-19కు కారణమైన కరోనా వైరస్ చాలా కొత్తదని తెలిపారు. చైనాలోని వుహాన్‌లో అతిపెద్ద మాంసం మార్కెట్ నుంచి తొలిసారిగా ఈ వైరస్ మనుషులకు వ్యాపించింది