భారత క్రికెట్ జట్టు త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో కరీబియన్ టూర్లో ఎవరికి విశ్రాంతినివ్వాలి.. ఎవరిని ఎంపిక చేయాలనేదానిపై భారత సెలక్టర్లు తలమునకలై ఉన్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలర్ జస్ప్రిత్ బుమ్రాకు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ భావిస్తోంది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ మహేంద్రసింగ్ ధోనీ ఎంపికపై ఎలాంటి అంచనాకు రాలేదు. సెలక్షన్ కమిటీ ఈనెల 17 లేదా 18న ముంబైలో సమావేశమై టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లకు టీమ్‌లకు ప్రకటించనున్నారు. కరీబియన్ పర్యటనలో ఆతిథ్య వెస్టిండీస్‌తో భారత్ 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది.
‘గత మూడు నెలల నుంచి ధోనీ విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. ఐపీఎల్-12 సమయంలోనే ధోనీ వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. ప్రపంచకప్ టోర్నీ మధ్యలో ధోనీ చేతి వేళ్లకు బంతి బలంగా తాకడంతో గాయమైంది. వచ్చే ఏడాది నుంచి టీమిండియా విరామం లేకుండా అంతర్జాతీయ క్రికెట్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ధోనీకి విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారని’ బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు విరాట్ కోహ్లీ, బుమ్రాకు విశ్రాంతినివ్వొచ్చు. వీలైతే టెస్టులకు కూడా ఎంపిక చేయకపోవచ్చు. టెస్టుల విషయమై పరిమిత ఓవర్ల సిరీస్ తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. సీనియర్ పేసర్ భువనేశ్వర్‌కుమార్ స్థానంలో పేసర్లు ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్ రూపంలో ప్రతిభగల బౌలర్లు సెలక్టర్లకు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. ఒకవేళ వెస్టిండీస్ టూర్‌కు కోహ్లీకి విశ్రాంతినిస్తే రోహిత్ శర్మ వన్డేల్లో భారత జట్టుకు సారథ్యం వహించనుండగా.. టెస్టుల్లో ఆజింక్య రహానెకు నాయకత్వ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. టీమ్‌మేనేజ్‌మెంట్‌తో పాటు కోహ్లీ, హెడ్‌కోచ్ రవిశాస్త్రిలను సంప్రదించిన తర్వాత సెలక్టర్లు జట్టు ఎంపికపై తుదినిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం