ఉద్యోగ రీత్యా చాలామంది చాలా చోట్ల ఉంటూ ఉంటారు, అయితే అక్కడ అందరికీ ఉండే సమస్య భోజన సమస్య, అందరికీ ఇంటి ఫుడ్ తింటే బాగుణ్ను అనుకుంటూ ఉంటారు, అయితే వెళ్ళిన ప్రతి చోటకీ ఫ్యామిలీని తిప్పడం ఎందుకు అనుకున్నాడో ఏమో ఈ మహానుబావుడు వెళ్ళిన ప్రతి చోటా ఒకర్ని పెళ్లి చేసుకుని ఒక ఫ్యామిలీ ఏర్పాటు చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే తుమకూరు జిల్లాకి చెందిన రిటైర్ అయిన ఎస్సై ఒకరు ఈ మధ్యే కాలం చేసారు. ఆయన కుటుంబీకులు అంత్యక్రియలు బాగానే చేశారు. ఆ తర్వాత ఆస్తుల వద్ద గొడవలు వచ్చి ఒకరిద్దరు కాదు ఏకంగా ఐదుగురు మహిళలు తామందరూ ఆయన భార్యలమంటూ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించడంతో అధికారులు ఖంగుతిన్నారు.
తుమకూరు తాలూకా స్వాందేనహళ్ళికి చెందిన ఎస్ఐ విశ్వనాథ్ ఏకంగా ఐదుగురుని వివాహం చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో సంసారం సాగించాడు. జూలై 18న గుండెపోటుతో మృతి చెందడంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది. మరణ సమయంలో ఆయన మూడో భార్య చేతన ఆయన వద్ద ఉన్నారు. తర్వాత విషయం తెలుసుకున్న విశ్వనాథ్ మొదటి, రెండో భార్య పిల్లలు కూడా అంత్యక్రియలలో పాల్గొన్నారు. అప్పటికి కర్మకాండ ముగించినా ఆస్తి కోసం విభేదాలు రావడంతో వారంతా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. మొదటి భార్య సరోజమ్మ, రెండో భార్య శారదతోపాటు మూడో భార్య చేతనే కాకుండా ఆయన రహస్యంగా మరో ఇరువురిని కూడా వివాహమాడినట్లు తెలిసింది. అయితే ఇరువురు భార్యలు ఆస్తి వాటా వద్దనుకుని వదిలేసినట్లు తెలుస్తోంది. మిగిలిన ముగ్గురు పెళ్ళాలు తుమకూరు గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.