రేవంత్ మీడియాతో మాట్లాడుతూ… తెరాస చేసిన పాపాలను కడుక్కునేందుకే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని విమర్శించారు. త్వరలో గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయనీ, గ్రేటర్ ప్రజలను మోసం చేసే కుట్ర ప్రారంభించారని ఆరోపించారు. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం కళ్లకు కనిపించేలా చేయడమే ముఖ్యోద్దేశం అన్నారు రేవంత్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు. హైదరాబాద్ పరిధిలో కేవలం 108 డబుల్ బెడ్ ఇళ్లను మాత్రమే కట్టారన్నారు.
కానీ, ఎర్రవల్లిలో డబుల్ బెడ్ ఇళ్లు, చింతమడ గ్రామానికి లక్షలకు లక్షలు ఇస్తారని ఎద్దేవా చేశారు. ఆ గ్రామాలకు నిధులు, పథకాలు కేటాయింపులపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదనీ, అదే తరహాలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలపై కూడా ముఖ్యమంత్రి పెద్ద మనసు ఉండాలి కదా అన్నారు. నువ్వేమన్నా ఎర్రవల్లి సర్పంచ్ , చింతమడకు ఎంపీటీసీవా, ఆ రెండు గ్రామాలకు మాత్రమే పనిచేస్తావా, మిగతావి కనిపించవా అంటూ కేసీఆర్ ని ఉద్దేశించి ప్రశ్నించారు రేవంత్.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్రం దుర్వినియోగం వంటి అంశాలపై ఆయన ఎందుకు సమీక్షలు నిర్వహించరని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఎర్రబస్సు తప్ప రైళ్లు తెలీవని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా రేవంత్ స్పందిస్తూ… కిషన్ రెడ్డి, ప్రధాని మోడీ పుట్టక ముందే తెలంగాణలో రైళ్లు ఉన్నాయని తెలుసుకోవాలన్నారు. పట్నం గోసలో తమ దృష్టికి వచ్చిన సమస్యల్ని ముఖ్యమంత్రికీ, గవర్నర్ కి నివేదిస్తామన్నారు.