సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ నేతలపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గత కొద్ది రోజులుగా మాట్లాడిన తీరుపై టీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. గురువారం పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఓ డ్రామా ఆర్టిస్టు అని, టెంట్, స్టంట్, ప్రెజెంట్, ఆబ్సెంట్ అన్నట్టుగా రేవంత్ రాజకీయం నడుస్తోందని ఎద్దేవాచేశారు. రేవంత్ తొక్కుతా అంటున్నాడు.
వంద మంది ఎమ్మెల్యేలు ఉన్న టీఆర్‌ఎస్ తలుచుకుంటే నిన్ను ఎంత లోతు తొక్కగలమో తెలుసా? అని ధ్వజమెత్తారు. రేవంత్ తీరుపై కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాయాలనే యోచనలో భాగంగా సోనియా, రాహుల్ కు ట్విట్టర్ లో లేఖ రాశానన్నారు. రేవంత్ మాటలు శ్రుతి మించితే ఏం చేయాలో తమకు తెలుసునని, కాంగ్రెస్‌లో పెద్ద నాయకులు లేనిది చూసి దొరికింది దోచుకోవడేమే రేవంత్ వైఖరి అని ఆరోపించారు.