వరుస ఓటములతో నీరసించిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే మున్సిపల్ ఎన్నికలు చాలా కీలకమైనవి కాబోతున్నాయి. క్షేత్రస్థాయిలో కేడర్ ని నిలబెట్టుకోవాలన్నా, కాంగ్రెస్ పార్టీకి మున్ముందు ఆశాజనకంగా ఉంటుందన్న నమ్మకం మిగిలున్న నాయకుల్లో కలిగించాలన్నా ఈ ఎన్నికల్లో మర్యాద దక్కే స్థానాలు దక్కించుకోవాల్సిందే. ఇక, నాయకులపరంగా చూసుకుంటే ఎంపీ రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికలు ఓరకంగా అసలైన సవాల్ కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయన పార్టీలో కొంతమంది సీనియర్ల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. పీసీసీ కొత్త అధ్యక్షుడి రేసులో ఉన్నవారిలో రేవంత్ అగ్రస్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో పార్టీకి కొత్త ఉత్సాహం నిండాలంటే ఆయనకే పగ్గాలు ఇవ్వాలనే డిమాండ్ ఉంది.
ఇదే సమయంలో… ఆయన పార్టీలోకి కొత్తగా వచ్చి చేరారనీ, మొదట్నుంచీ ఉన్నవారికే కీలక పదవులు ఇవ్వాలంటూ సీనియర్లు కొందరు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తన పట్టుని మరోసారి హైకమాండ్ ముందు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరిలో పార్టీని గెలిపించుకోవాల్సిన పరిస్థితి. మల్కాగిరి దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు స్థానం. 10 మున్సిపాలిటీలు 3 కార్పొరేషన్లు ఈ నియోజక వర్గం పరిధిలో ఉన్నాయి. అన్ని చోట్లా పార్టీని నడిపించాల్సిన బాధ్యత ఆయనపైనే ఉంది. దీంతోపాటు, తన సొంత అసెంబ్లీ నియోజక వర్గమైన కొడంగల్ లో కూడా పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం రేవంత్ కి ఎంతైనా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచి ఓడిపోయారు.
అయినా, అక్కడా తన పట్టు ఏమాత్రం తగ్గలేదని చాటిచెప్పాలంటే పార్టీని గెలిపించుకోవాల్సిందే. అక్కడున్న రెండు మున్సిపాలిటీలు దక్కించుకోవాలి. ప్రస్తుతం రేవంత్ మల్కాజ్ గిరిలోనే ఎక్కువగా ఉంటున్నారు. ఇక్కడ ఎంపీగా గెలిచారుగానీ, స్థానికంగా ప్రజలకు మరింత చేరువ కావాల్సి ఉంది. కొడంగల్ వ్యవహారాలు ఆయన సోదరుడు చూస్తున్నారు. త్వరలో అక్కడికీ వెళ్లి ప్రచారం చేస్తారని తెలుస్తోంది. కొడంగల్, మల్కాజ్ గిరీ… ఈ రెండు చోట్లా పార్టీని రేవంత్ రెడ్డి గెలిపించుకోవాలి. లేదంటే, సొంత పార్టీ నాయకుల నుంచే విమర్శలుంటాయి. సొంత నియోజక వర్గాల్లో మున్సిపాలిటీలను గెలిపించుకోలేని నాయకుడు… పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని ఎలా నడపగలరు అనే ప్రశ్నను వాళ్లే తీసుకొస్తారు. దీన్నో పెద్ద అనర్హతగా హైకమాండ్ కి ఊదరగొడతారు! ఆ నోళ్లు మూయించాలంటే పార్టీని గెలిపించుకోవాల్సిందే. సో… రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఓరకంగా రేవంత్ రెడ్డి పీసీసీ పదవికి అర్హత అంశంగా మారబోతున్నాయని చెప్పొచ్చు.